• ఐదు నెలలుగా జీతాలు లేక సతమతమం

  • కలెక్టర్ జోక్యం చేసుకున్నా కానరాని స్పందన

నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకురు సెజ్‌లోని ‘ప్రైమ్ హైటెక్ ఇంజనీరింగ్’ కంపెనీ కార్మికులు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయారు. యాజమాన్యం వేర్వేరు కారణాలు చూపి దాదాపు ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. స్వయంగా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకున్నా యాజమాన్యం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.

గత నెల నుంచి సమ్మె చేస్తూ స్వయంగా జిల్లా కలెక్టర్‌కు తమగోడు వినిపించుకున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పందించి కార్మిక శాఖ అధికారులను పంపించి తగు చర్యలకు ఆదేశించినా కూడా యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేదు. కార్మిక శాఖ ఆదేశాల ప్రకారం ఈ నెల 7వ తేదీ నాటికి వేతన బకాయి మొత్తంలో 60 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. కానీ ఈనెల 15 తరువాత జూన్ నెలలో రావాల్సిన జీతం లో 60 శాతం మాత్రమే ఇచ్చారు.

మిగతా బకాయిల కోసం కార్మికులు మళ్లీ విశాఖపట్నంలోని కార్మిక శాఖ కమిషనర్‌ను ఆశ్రయించగా అక్కడ కూడా కంపెనీ అధికారులు ఏవో కారణాలు చెప్పి ఇప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో చివరి అస్త్రంగా కార్మికలు సమ్మెకు దిగారు. వేతన బకాయిలు చెల్లించేంత వరకూ తమ నిరసన ఆగదని కార్మికులు స్పష్టంచేశారు. ఇదిలావుండగా, విధులకు హాజరైన వారు జీతభత్యాల గురించి యాజమాన్యాన్ని గట్టిగా నిలదీయడంతో హుటాహుటిన 5 రోజులు సెలవులు ప్రకటించడానికి సిద్ధపడ్డారు.

దీంతో కార్మికులు తమ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ కంపెనీ నుంచి కదిలేది లేదని అక్కడే నిరసన తెలపడంతో యాజమాన్యం అయోమయంలో పడింది.