‘అహింస’ తిరుగులేని ఆయుధమని నిరూపించిన మహాత్ముని జయంతి ఈరోజు. అతని పాదముద్రలు పడిన నేలపైనే మనం కూడా వున్నామన్న ఆలోచనే గర్వంగా అనిపిస్తుంది. ఒకప్పుడు అటువంటి ఓ వ్యక్తి ఈ నేలమీద నడయాడాడని చెబితే భవిష్యత్తు తరాలు నిజమా అని నివ్వెరపోయే వ్యక్తిత్వం ఆయనది. గాంధీ జయంతి అనగానే ఒక్కసారిగా ఆ శాంతి స్వరపం, సహనం నిండుగా కలిగిన చిరునవ్వు మన కళ్లెదుట నిలుస్తారు. మహనీయుల గురించి విన్నాచాలు, ఆ లక్షణాల గురించి తలచుకున్నా చాలు.

వాటి నుంచి ఎంతోకొంత శక్తి మనల్ని ఆకర్షిస్తుంది. ఒకటో రెండో లక్షణాలు ఎప్పడో అప్పుడు మనలో పాదుకుంటారు అంటారు పెద్దలు. మరి ఈరోజున ఆ మహాత్ముని తలచుకుని, ఆయన నమ్మిన సిద్ధాంతాలను నమ్మి, ప్రేమించి, ఆచరించే ‘సౌశీల్యం’ అందరికీ రావాలని కోరుకుందాం. మహాత్మా గాంధీ వ్యక్తి విషయంలో అయినా, గ్రామం విషయంలో అయినా ఓ దేశం విషయంలో అయినా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ‘స్వయం సమృద్ధి’ వుండాలని. స్వయం సమృద్ధి సాధించడానికి స్వయం నియంత్రణ, అందుకు తగ్గ ఆచరణ ముఖ్యం. ఆయన కలలు కన్న భారతావని నేటికీ సాధ్యపడిందో లేదోగానీ, ఆయన కలలు కన్నట్టు స్వయం సమృద్ధిని సాధించిన గ్రామం ఒకటుంది.

దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గత 25 సంవత్సరాలుగా ఆ గ్రామంలోని పౌరులెవ్వరూ కోర్టుకుగానీ, పోలీస్‌ స్టేషన్‌కి గానీ వెళ్ళలేదంటే నమ్మగలరా? ఒక్క గ్రామస్థుడికి కూడా ‘అప్పు’ లేదు. సరికదా, ఏ బ్యాంకులోనూ లోను కూడా లేకుండా వున్నాడంటే నమ్మగలరా! ఏ రాజకీయ పార్టీతో గానీ, ప్రభుత్వ పథకాలతోగానీ పనిలేదు ఆ గ్రామస్థులకి. అదే రణవేడే గ్రామం. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో రాయ్‌ఘడ్‌ జిల్లాలో వుంది రణవేడే గ్రామం. 400 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ గ్రామమిది. ఇప్పడికీ మనం ఆ గ్రామంలోకి అడుగుపెడితే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మధ్య దూరం పది నుంచి పన్నెండు అడుగులదాకా వుంటుంది. అదీ చక్కగా, శుభ్రంగా, ఏ చెత్తాచెదారం లేకుండా.

ఒక ఇంటి నుంచి మరో ఇంటి మధ్య ఖాళీ స్థలంలో మొక్కలు వుంటారు. ఇదంతా గ్రామస్థులందరూ ఎప్పటి నుంచో ఇష్టంగా పాటిస్తూ వస్తున్న నియమమట. రణవేడే గ్రామంలో ఒకే ఒక్క పచారీ కొట్టు వుంది. గ్రామస్థులంతా ఆ కొట్టు నుంచే తమ నిత్యావసర వస్తువులు కొంటారు. అది ఒకరకంగా గ్రామస్థుల ఉమ్మడి నిర్వహణలో నడుస్తున్న కొట్టు. అలాగే గ్రామస్థులంతా కలసి ఓ బడిని, ఓ గుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం, సాయంత్రం గ్రామంలోని వారంతా ఒక్క చోట చేరి సామూహిక ప్రార్థనలు, పూజలు చేస్తారు. ఈ గ్రామస్థులలో ఎవరికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం వుండదు.

అన్ని రాజకీయ పార్టీలవారిని ఆదరిస్తారు. కానీ, గ్రామస్థులంతా కలసి నిర్ణరుంచుకుని ఒక్కరికే ఓటు వేస్తారు. అలాగే గ్రామపెద్దల మాట ఎవరూ జవదాటరు. ఎలాంటి బలవంతం, బెదిరింపులు వుండవు. ఇప్పటితరం కూడా గ్రామ నియమాలని గౌరవిస్తుంది. పాటిస్తుంది. గ్రామంలో అన్ని వృత్తులవారూ వుంటారు. ఒకరికొకరు సాయపడతారు. ఎవరికీ ఎవరూ పోటీ కాదు. తమకి కావలసిన ఆహార పదార్ధాలని తామే పండించుకుంటారు. ‘ఇమిటేషన్‌ జ్యూయలరీ’ తయారీ ఈ గ్రామస్థులలో చాలామందికి ఉపాధి మార్గం. అన్ని కులాలవారు, మతాలవారు కలసిమెలసి సహజీవనం సాగిస్తారు.

ఏ అల్లర్లు, అలజడులు దరిచేరని గ్రామమది. ఆచారాలు, కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రకృతితో సహజీవనం మా విజయ సూత్రాలని గర్వంగా చెబుతారు. రణవేడే గ్రామస్థులు. గ్రామస్థారులో మొదలయ్యే అభివృద్ధి నిస్సందేహంగా దేశ స్థితిగతులను అభివృద్ధి దిశలో నడిపిస్తుంది. ఆదర్శ గ్రామం రణవేడే గురించి వినగానే గాంధీ మహాత్ముడి కలల గ్రామం కళ్ళెదుట నిలిచినట్టు వుంది కదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here