ప్రమాదానికి కొద్దిసేపటి ముందు మిత్రులతో కలిసి అమెరికాలోని ఓ పర్యాటక ప్రదేశం వద్ద మూర్తి దిగిన చిత్రం.
  • అమెరికా రోడ్డు ప్రమాదంలో దారుణం

  • సీనియర్ జర్నలిస్టు సహా మరో ముగ్గురు మరణం

  అలస్కా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద భీతావ దృశ్యం.

  కాలిఫోర్నియా: ‘గోల్డ్‌స్పాట్‌’ మూర్తిగా అందరికీ సుపరిచితమయిన డాక్టర్ మతుకుమిల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి (ఎంవీవీఎస్‌ మూర్తి) ఇకలేరు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాజీ ఎంపీ, ‘గీతం’ విశ్వవిద్యాలయం అధినేత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా కూడా ఎంవీవీఎస్‌ మూర్తి సుపరిచితుడే.

  భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న సీనియర్ జర్నలిస్టు వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా కడియాల వెంకటరత్నం (గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు.

  ప్రమాదం జరిగిన అలస్కా జాతీయ రహదారిలో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్.

  ప్రమాద సమాచారం తెలుసుకున్న ‘తానా’ సభ్యులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న ‘గీతం’ పూర్వవిద్యార్థుల సమావేశంలో మూర్తి ప్రసంగించాల్సి ఉంది. మూర్తి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామం.

  జిల్లా కేంద్రం కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించిన మూర్తి పారిశ్రామికవేత్తగానే కాకుండా విద్యావేత్తగా కూడా గుర్తింపు పొందారు. గీతం విద్యా సంస్థల ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంకోవైపు, రాజకీయంగానూ ఆయన అనేక పదవులు అలంకరించారు.

  ‘గీతం‘ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన అమెరికా వెళ్లారు. వైల్డ్‌లైఫ్‌ సఫారీ చూసేందుకు మిత్రులతో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సమీప బంధువు. ఆయన మనవడిని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తెకు ఇచ్చి వివాహం చేశారు.

  రాజకీయంగా ఆయన గురించి చెప్పాల్సి వస్తే, 1991లో తొలిసారి ఆయన పదవ లోక్‌సభకు సభ్యునిగా ఎన్నికయ్యారు. అప్పట్లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1999లో పదమూడవ లోక్‌సభకూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి చేతిలో కేవలం 8.71 శాతం ఓట్ల తేడాతో మూర్తి ఓటమిపాలయ్యారు.

  2009, 2014 ఎన్నికలకు ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇదిలావుండగా, అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మరణంతో తెలుగుదేశం నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెళ్లిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మూర్తి మరణవార్త తెలియగానే షాక్‌కు గురయ్యారు. వెంటనే విశాఖ వెళ్లి ఎంవీవీఎస్ కుటుంబ సభ్యులను ఓదార్చి అక్కడి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించడంతో గంటా హుటాహుటిన విశాఖపట్నం బయలు దేరారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్న మూర్తి  1980లో గీతమ్ యూనివర్సిటీని నెలకొల్పి దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

  నందమూరి తారక రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1991లో విశాఖ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో రెండవసారి ఎంపిగా గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్సీగాను సేవలందించారు. పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి ఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూర్తి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంవీవీఎస్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.