ముంబయి: రూపాయి దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. బుధవారం స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింతగా క్షీణించి తాజా జీవనకాల కనిష్ఠమైన రూ.73.41 పడిపోవడంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల, ఇటలీ సంక్షోభం దేశీయ సూచీలపై తీవ్ర ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 36వేల పాయింట్ల దిగువకు పడిపోగా నిఫ్టీ 10,900 పాయింట్ల దిగువకు వెళ్లింది. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు బాగా నష్టపోయాయి.

సెన్సెక్స్‌ ఉదయం 160 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 11 వేల పాయింట్ల దిగువన ట్రేడింగ్‌ ప్రారంభించింది. తర్వాత కూడా మార్కెట్లు ఆద్యంతం నష్టాల్లోనే నడిచాయి. చివరకు సెన్సెక్స్‌ 550 పాయింట్లు నష్టపోయి 35975.63 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 150.05 పాయింట్లు నష్టపోయి 10858.25 పాయింట్లకు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.73.24 వద్ద కొనసాగింది. బుధవారం వివిధ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూసినప్పటికీ లోహ రంగ షేర్లు మాత్రం లాభాల్లో నడిచాయి. ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంకు, హిందాల్కో, హెచ్‌పీసీఎల్‌, వేదాంత, బీపీసీఎల్‌ తదితర కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, వోడాఫోన్‌ ఐడియా, టీసీఎస్‌ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

మరోవైపు, బంగారం ధరలు దేశీయంగా భారీగా పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, స్థానిక ఆభరణ వర్తకుల జరుపుతున్న కొనుగోళ్ల సందడితో బంగారం ధరలకు ఊపు వచ్చింది. బుధవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 550 రూపాయలకు పైగా ఎగిసి రూ. 32,030ను టచ్‌ చేసింది. వెండి సైతం బంగారం మాదిరిగానే పెరిగి, కేజీకి రూ.39 వేలకు పైగా నమోదైంది. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో, వెండి కూడా ఎగిసింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రక్షించేందుకు అమెరికా, కెనడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో, బంగారానికి డిమాండ్‌ పెరిగిందని ట్రేడర్లు చెప్పారు.

అంతేకాక రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోకి దిగజారుతుండటంతో, డాలర్‌తో జరిపే దిగుమతులు ఖరీదైనవిగా మారుతూ బంగారం ధరలకు మద్దతు ఇస్తున్నాయి. అటు గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. బడ్జెట్‌ లోటును అధిగమించేందుకు ఇటలీ ప్లాన్లలో ఆందోళనలు చెలరేగడంతో, బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. స్పాట్‌ గోల్డ్‌ ధర 0.1 శాతం పెరిగి ఇంట్రాడేలో 1,203.31 డాలర్లుగా నమోదైంది. ఒక్క మంగళవారం రోజే ఏకంగా 1.3 శాతం పెరిగింది స్పాట్‌ గోల్డ్‌ ధర. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 555 రూపాయల చొప్పున పెరిగి రూ.32,030గా, రూ.31,880గా నమోదైంది.

మొత్తానికి దలాల్‌ స్ట్రీట్‌ మరోసారి కుప్పకూలిందనే చెప్పాలి. చివరి గంట ట్రేడింగ్‌లో పూర్తిగా బేర్స్‌ ఆధిపత్యం చెలాయించడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 550 పాయింట్లు క్రాష్‌ అయి, 36వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు నష్టపోయి తన కీలక మైన మార్క్‌ 10,850 దిగువకూ దిగజారింది. క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగిపోతుండటం, ఇటలీ బడ్జెట్‌ ప్లాన్‌, రూపీ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోవడం, అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను తీవ్రంగా దెబ్బకొట్టింది. చివరి గంటల్లో అమ్మకాల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు మార్కెట్లను భారీగా కుప్పకూల్చాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నేటి ట్రేడింగ్‌లో నష్టాల్లోనే ఉన్నాయి.

కేవలం మెటల్స్‌ మాత్రమే లాభాలు ఆర్జించాయి. మార్కెట్‌ అవర్స్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 550 పాయింట్లు నష్టపోయి 35,975 వద్ద, నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 10,858 వద్ద క్లోజయ్యాయి. మొట్టమొదటిసారి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 73 మార్కు దిగువకు క్షీణించి, 73.42 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఒక్కో బ్యారల్‌కు 85 డాలర్లను మించిపోవడంతో, రూపీ ఇలా భారీగా క్షీణించింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు ఈ విధంగా పడిపోవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఏప్రిల్‌ నుంచి బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 20 శాతానికి పైగా ఎగిశాయి. దీంతో రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కొంటుందని విశ్లేషకులు చెప్పారు.

అయితే మార్కెట్‌ ముగిసే సమయంలో రూపాయి విలువ భారీగా రికవరీ అయింది. 73.42 మార్కును తాకిన రూపాయి 40 పైసలకు పైగా రికవరీ అయింది. అయినప్పటికీ మార్కెట్లు మాత్రం కోలుకోలేదు. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రిలయన్స్‌ నిప్పన్ అసెట్ మేనేజ్‌మెంట్‌, ముథూట్‌ ఫైనాన్స్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, జుబిలియంట్‌ ఫుడ్‌వర్క్స్‌, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌, డాబర్‌, జీఎస్‌కే కన్జ్యూమర్‌, బాటా ఇండియా, అంబుజా సిమెంట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజస్‌, అపోలో టైర్స్‌ 3 శాతం నుంచి 10 శాతం వరకు క్షీణించాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 85 డాలర్లను మించిపోయింది.