• ఓటుతో ఆశీర్వదించాలన్న మాజీ ఎమ్మెల్సీ

  • మంచిర్యాల ప్రగతి తనతోనే సాధ్యమన్న నేత

ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో చెప్పలేనంత హడావుడి చోటుచేసుకుంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ తన అభ్యర్ధులను రంగంలోకి దింపేందుకు ముందుగానే జాబితాలు సిద్ధంచేసుకున్నాయి. కాకపోతే, తెరాస కాస్త తొందరపడినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ అభ్యర్ధులను ఎంపికచేసే పనిలో పడింది. అయినప్పటికీ ఆ పార్టీ సాధ్యమైనంత వరకూ సమర్ధులనే బరిలోకి దింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి విడిపడి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన అదృష్టాన్ని ఈసారి పరీక్షించుకునేందుకు ఓటర్ల ముందుకు వస్తున్నారు. అయితే, ఆయనకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న వర్గపోరు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మధ్య సమన్వయం లోపం ఎంత వరకు సహకరిస్తుందో వేచిచూడాలి.

మరోవైపు, ప్రేమ్‌సాగర్‌రావు అభ్యర్ధిత్వంపై ముందు నుంచీ పార్టీ అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉండడం, ఆయనకు మించిన అభ్యర్ధి అక్కడ పోటీకి లేకపోవడం కూడా కలసిరానుందన్నది నిర్ధ్వందం. ఇంకోవైపు, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని నిలువరించాలంటే ముందుగా పార్టీలో ఐక్యత ముఖ్యమని కాంగ్రెస్ ముందు నుంచీ భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు రెండేళ్ల నుంచే ఆరంభించింది.

ఈ దిశగా ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జిల్లాలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గాల్లో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.

మరోపక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రాబల్యాన్ని చాటేందుకు యత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలైందన్నది గతంలో జరిగిన ప్రచారమే గానీ, వాస్తవంలో అలాంటిదేమీ లేదన్నది ప్రేమ్‌సాగర్‌రావు మాటలను బట్టి తెలుస్తోంది.

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొందన్నది అందరికీ తెలిసిందే. బోథ్‌లో సోయం బాపురావు, అనిల్‌జాదవ్‌లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు.

మరోవైపు, ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా? లేనిపక్షంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగుతారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌ జాదవ్‌ కిందటిసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్‌ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు.

ముథోల్‌ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి. సీనియర్‌ నాయకులైన నారాయణరావు పటేల్‌ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా? లేనిపక్షంలో మహేశ్వర్‌రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్‌ పైచేయి సాధిస్తారా? అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్‌ నియోజకవర్గంలో భరత్‌ చౌహాన్, హరినాయక్‌ మధ్య వైరుధ్యం ఉందన్నది కాంగ్రెస్‌ శ్రేణులందరికీ తెలిసిందే.

ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డి పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్‌లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది.

ప్రధానంగా ఇన్‌చార్జీలు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అధిష్టానం మన్ననల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇటీవల టీపీసీసీలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే తీర్మానం కూడా చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ద్వారా కొత్త జిల్లాలకు అధ్యక్షులను గుర్తించే విషయంలోనూ ఇన్‌చార్జీ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

నిరుపేద, దారిద్య్రరేఖకు దిగువ ఉన్న ఆర్యవైశ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 5 శాతం ఉన్న వైశ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తారన్నారని కూడా సోమారపు ప్రకటించేశారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైశ్యులతో సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయన పలికిన చిలక పలుకులనే తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ కూడా వల్లించారు.

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వైశ్యుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారన్నారు. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు అన్ని పుణ్యక్షేత్రాల్లో వైశ్యులే నిత్యాన్నదానం చేస్తున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా తదితరులతో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కూడా తమ సామాజిక వర్గం అభ్యున్నతికి తాము పాటుపడతామనే ప్రకటిస్తున్నారు.

వైశ్యులు వ్యాపారంగానే కాకుండా రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా చేసే బాధ్యత తమదని ఎవరికి వారు చెబుతున్నప్పటికీ ప్రేమ్‌సాగర్‌రావుకు ఉన్న చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నది నియోజకవర్గంలోని ప్రజల మాట. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇప్పటికే నియోజకవర్గంలో మంచి నేతగా గుర్తింపు పొందారు.

ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో అధికార తెరాస అభ్యర్ధిది రెండో స్ధానమని ఎన్నికల తేదీకి ముందే తేలిపోయిందంటే ప్రేమ్‌సాగర్‌రావు పనితీరు, స్పందించే గుణం ఎలాంటిదో అర్ధమవుతోంది. ఏది ఏమైనా రానున్న ఎన్నికలు అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అధికార తెరాసకు ముచ్చెమటలు పట్టించనున్నాయన్నదాంట్లో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here