హైదరాబాద్: అన్నీ అనుకూలంగా ఉన్నా పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి మాత్రం అవరోధాలు తప్పడం లేదు అన్నదాతకు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో పక్షం రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభించారు. కానీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో ధాన్యం విక్రయించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఈ సీజన్‌లో జిల్లాలో మొత్తం 1.20 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి వేశారు.

ఎకరాకు సుమారు 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసింది పోను మిగతా 3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకు గాను మొత్తం 290 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి అనుమతులు కూడా ఇచ్చారు. అయితే గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయటంలో జాప్యం చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రాల్లో వరి కోతలు చేస్తున్న రైతులు ధాన్యం దాచుకోవడానికి సౌకర్యాలు లేక కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు తీసుకొచ్చి కుప్పలు పోస్తున్నారు.

తూకం కోసం నిత్యం రాశుల వద్దే నిరీక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొంటున్నాయి. పగలు భానుడు భగభగ మంటున్నాడు. దీనివల్ల వడ్ల బరువు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎంత తొందరగా విక్రయిస్తే రైతులకు అంత ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకొని ధర తగ్గించి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వ్యాపారులకు ఆ అవకాశం ఇవ్వకుండా కొనుగోళ్లను ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సీజన్‌లో సన్నరకం వరి సాగుపై రైతులు ఆసక్తి చూపారు.

జిల్లాలో సుమారు 1.1 లక్షల ఎకరాల్లో పంటను వేశారు. మొత్తం 3.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఈ రకాన్ని కొనుగోలు చేయడం లేదు. గతంలో వీటి కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోవటం లేదు. దీంతో ఈ రకం సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవటంతో ప్రైవేటు వ్యాపారులు అడిగిన ధరకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సన్న రకాలను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.