వాషింగ్టన్‌: భారత సంతతి అమెరిక్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. భారతీయ అమెరికన్ల దగ్గర విలువైన ఆభరణాలు ఉండటంతో వాటిని దోచుకెళ్తున్నారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్‌ కుటుంబం ఇంట్లో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దొంగలు తమ విలువైన ఆభరణాలు ఎత్తుకుపోయారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండేట్లు హెచ్చరించాలని అక్కడి పోలీసులకు వెల్లడించారు.

నార్‌వాక్‌ ప్రాంతంలోని భారత సంతతి అమెరికన్‌ కుటుంబానికి చెందిన ఇంట్లో రూ.14.72 లక్షల విలువైన ఇత్తడి ఆభరణాలు చోరీకి గురైనట్లు తమ నిఘాలో ఉన్న ఓ వీడియోను నార్‌వాక్‌ పోలీస్‌ విభాగం షేర్‌ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అందుకు దొంగలు ఉపయోగించిన వాహనాన్ని నగరం వెలుపల స్వాధీనం చేసుకున్నారని, దాని లైసెన్స్‌ ప్లేట్‌ తొలగించి, వేలిముద్రలు కనిపించకుండా చేశారని వెల్లడించింది. భారతీయ అమెరికన్లు తమ ఆచారాలు, సంస్కృతికి అనుగుణంగా విలువైన ఆభరణాలు కలిగి ఉంటారనే భావనతో వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని ఓ సీనియర్‌ పోలీస్‌ అధికారి చెప్పారు.