రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో పోయిన ప్రతిష్టను నిలుపుకోవటానికి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోయింది. తెలంగాణ నినాదాన్నే అవహేళన చేసి, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న టీడీపీతో మహాకూటమి పేరుతో జతకట్టడం ఆత్మహత్యాసదృశ్యమే. కాంగ్రెస్ నేటి దుస్థితికి ఆ పార్టీ తీసుకుంటున్న అపరిపక్వ వినాశకరమైన విధానాలే కారణం.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రధాన ఘట్టానికి రిహార్సల్ అన్నట్లుగా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల నవంబర్ 12న మొదలై డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ దశల్లో జరుగుతాయి. నక్సల్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫా ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 7న తెలంగాణతో పాటు, రాజస్థాన్‌లో ఎన్నికలు జరుగుతాయని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతాయి.

మరో ఆరునెలల్లో సార్వత్రిక ఎన్నిక లు జరుగబోతున్న తరుణంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళి తప్పకుండా జాతీయ రాజకీయాలపై తీవ్రంగా ఉంటుందనటంలో సందేహం లేదు. ఈ ఐదు రాష్ర్టాలను చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో టీఆర్‌ఎస్, మిజోరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉత్తరాది రాజకీయాలను ప్రభావితం చేయగల స్థితి ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఎన్నికల ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అయితే ఇప్పటికే వెలువడుతున్న అధ్యయనాలు, పోల్ సర్వేలు బీజేపీకి కష్టకాలమేనని చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఒకట్రెండు సార్లు అధికారం నిలుపుకున్న బీజేపీ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటోంది.

రాజస్థాన్‌లో గత పదేండ్లలో ఏ పార్టీ రెండోసారి అధికారం చేజిక్కించుకున్న దాఖలాల్లేవు. కానీ బీజేపీ వ్యతిరేక పవనాలున్నాయన్నది మాత్రం అధ్యయనాలన్నీ సూత్రప్రాయంగా చెబుతుండటం గమనార్హం. పోల్ సర్వేలు, సామాజిక అధ్యయనాల ప్రకారం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నదన్నది తప్పి తే, ఈ రాష్ట్రాలన్నింటా కాంగ్రెస్ కష్టాలను ఎదుర్కొంటోంది. సమర్థమైన ఏకదృవ నాయకత్వం లేదు. విభిన్న రాజకీయ కుంపట్లతో, అంతర్గత కుమ్ములాటలతో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో సహా చాలా ప్రాంతాల్లో తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంది. రాజస్థాన్‌లో తప్పకుండా గెలిచితీరుతుందన్న వాతావరణంలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించే స్థితి కాంగ్రెస్‌కు లేదు.

కాస్త అటుఇటుగా తెలంగాణతో సహా అంతటా కాంగ్రెస్‌కు ఇదే దుస్థితి. తెలంగాణలోనైతే గెలుస్తారని అంచనా ఉన్నవారందరూ తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుంటున్న స్థితి ఉంది. ఇదిలా ఉంటే ఏబీపీ-సీ ఓటర్, సీ ఫోర్ విడివిడిగా చేసిన సర్వేలు అన్నీ ఒకేవిధంగా ఏమీ లేవు. ఏబీసీ-సీ ఓటర్ సర్వే కాంగ్రెస్ హవా వీస్తోందని చెబుతుంటే, సీ ఫోర్ మాత్ర కాంగ్రెస్‌కు అనుకూలత ఉన్నదని మాత్రమే చెబుతోంది. మరోవైపు గమనించాల్సిన విషయమేమంటే ఈ రాష్ట్రాల్లో ఈ అధ్యయనాలు చెబుతున్న దానిప్రకారం కాం గ్రెస్, బీజేపీల మధ్య రెండు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది.

ఇది కూడా ఎన్నికల నాటికి పరిస్థితులు, పార్టీల ప్రచారసరళి తదితర అంశాలతో ఓట్ల శాతం అటుఇటుగా మారవచ్చని కూడా చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎన్డీయేతర పక్షాలన్నింటినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. కానీ అలాంటి చొరవ తీసుకుంటున్న పరిస్థితేమీ లేకపోగా, యూపీలో చేతులు కలిపిన బీఎస్పీని కూడా దూరం చేసుకుంటున్న తీరు రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఏడాదిన్నర కిత్రం కర్ణాటక ఎన్నికల సందర్భంగా బీజేపీయేత ర 12 ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జాతీయంగా మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించాయి.

కానీ అది ఆదిలోనే ఆవిరైపోయింది. ఉత్తరాదిన గుణాత్మకమైన ఓటుబ్యాంకు శక్తిగా ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో కలిసేది లేదని ప్రకటించేదాకా వెళ్లటం కాంగ్రెస్ స్వయంకృపరాదమే. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణలో విభిన్న స్థితి ఉంది. మిగతా రాష్ట్రాలకన్నా ముందుగానే ఎన్నికలు జరుగుతాయనుకన్నప్పటికీ ఓటరు జాబితాపై ఏర్పడిన వివాదాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఎన్నికలు జరిగే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికీ కాంగ్రెస్ అడ్డుతగులుతూ కేసులతో ఆటంకాలేర్పరుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ప్రజాక్షేత్రంలోనే తీర్పునకు సిద్ధమయ్యారు.

ఈ అనివార్యతలోంచి ముందస్తుగా వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తనదైన శైలిలో దూసుకుపోతోంది. గత నెల ఆరున అభ్యర్థుల ఎంపికను ప్రకటించి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. అయితే రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో పోయిన ప్రతిష్టను నిలుపుకోవటానికి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించలేకపోయింది.

తెలంగాణ నినాదాన్నే అవహేళన చేసి, రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న టీడీపీతో మహాకూటమి పేరుతో జతకట్టడం ఆత్మహత్యాసదృశ్యమే. కాంగ్రెస్ నేటి దుస్థితికి ఆ పార్టీ తీసుకుంటున్న అపరిపక్వ వినాశకరమైన విధానాలే కారణం. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకోలేకుంటే దాన్నెవరూ కాపాడలేరు. మత వాదంపై ఆధారపడి నెగ్గుకొస్తున్న బీజేపీ ఉనికిని చాటుకోవటానికే తంటాలుపడుతోంది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయంటారు.

ఈ అర్థంలో కాంగ్రెస్ జాతీయంగానూ, తెలంగాణలోనూ తప్పుడు రాజకీయ విధానాలతో ఆత్మహత్య చేసుకుంటోంది.