న్యూఢిల్లీ: విజయదశమిని దేశమంతా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. సాయంత్రం పలుచోట్ల రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణుడితో పాటు కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలను తగులబెట్టారు. పంజాబ్‌లో ఈ వేడుక కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. రావణాసురుడి బొమ్మకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన మంత్రివర్గ సహచరుల ఫోటోలను పెట్టి రైతులు తగులబెట్టారు. వరిగడ్డిని పొలాల్లో తగులబెట్టడం వల్ల విపరీతమైన పొగ వెలువడి కాలుష్యభరితం అవుతోందని, దాన్ని నివారించాలని కోర్టు ఆదేశించింది. దీంతో, పంజాబ్ ప్రభుత్వం పొలాల్లో వరిగడ్డిని తగుబెట్టవద్దని చెప్పింది. దీంతో, ఒక్కో ఎకరంలో టన్నులకొద్ది ఉత్పత్తి అయ్యే వరిగడ్డిని ఏం చేసుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో యంత్రాల వాడకం వల్ల వరిగడ్డి సమస్యగా మారింది.

మిషన్ వరి కంకికి ఉన్న వడ్లను తీసుకుని దంటుని మొత్తం వదిలేస్తుంది. ఇవి పొలాల్లో అలాగే ఉంటే దుక్కి దున్నడానికి అడ్డంకిగా మారుతాయి. అందుకే వాటిని పొలాల్లోనే తగులబెడుతున్నారు. లక్షల ఎకరాల్లో సాగే ఈ దహనకాండ గత సంవత్సరం పంజాబ్, హర్యానాతో పాటు పక్కనే ఉండే ఢిల్లీ నగరాన్ని చాలారోజులు ఊపిరి తీసుకోనీయలేదు. మరోవైపు, విజయానికి ప్రతీక అయిన పండుగ విజయదశమిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఆలయాలు ఉదయం నుంచే మంత్రోచ్ఛారణలతో మారుమ్రోగాయి. వివిధ రూపాల్లో కొలువుదీరిన ఆదిశక్తికి అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దసరా మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. 9వ రోజున శ్రీలక్ష్మీ తాయారు కోవెలలో అమ్మవారు నిజరూప మహాలక్ష్మీ అలంకారంలో దర్శమిచ్చారు. అంతకుముందు అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. నిజరూప మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తీర్థప్రసాదాలు అందుకుని అమ్మవారి ఆశీర్వచనాలు పొందారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఇవాళ వేద పండితులు సరస్వతి యాగం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయంకాలం అమ్మవారు నెమలి రథంలో ఆసీనులై ఆలయ మాఢ వీధుల్లో శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పండితులు మహా నివేదన మంగళహారతితో దసరా ఉత్సవాలను ముగించారు. వరంగల్ మహానగరంలోని భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమి ఐన తొమ్మిదవ రోజున భద్రకాళి అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనం ఇచ్చారు. అలాగే ఉదయం నిత్యాహ్నీకం, సిద్ధి దాత్రీ దుర్గార్చన, ప్రత్యేక పూజలు సాయంత్రం జలక్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. విజయదశమి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ఆలయాల్లో భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు.

అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని గిద్దె పెరుమాళ్ల స్వామి ఆలయంలో శమీపూజ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అలాయ్-బలాయ్‌తో జమ్మి ఆకులను పంచుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణలో విజయదశమి పండుగ ప్రత్యేకమైనదని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. విజయాన్ని అందించే ఈ పండుగ రోజున రాష్ట్ర అభివృద్ధికి దీవెనలు అందించాలని భగవంతున్ని కోరుకున్నట్లు ఎంపీ వినోద్‌, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల తెలిపారు. అమ్మవారికి అత్యంత నిష్ఠతో పూజలు నిర్వహించారు. వాహన, ఆయుధ పూజలు చేశారు. మధ్యాహ్నం జమ్మిచెట్టుకు పూజలు చేశారు.

పాలపిట్టను దర్శించుకుని, ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే, హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కూడా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. వాహన, ఆయుధ పూజను సీఎం కేసీఆర్ స్వయంగా జరిపారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


Fatal error: Allowed memory size of 67108864 bytes exhausted (tried to allocate 55 bytes) in /home/content/99/10169099/html/newstimews/wp-includes/cache.php on line 676