• దీపావళి రోజు కేవలం రెండు గంటలే అనుమతి

  • అంతకుమించి బాణాసంచా కాల్చితే చర్యలు

  • కీలక తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: దీపావళి వేడుకల పేరిట వినియోగించే బాణాసంచా వల్ల వెలువడుతున్న వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి రోజు కేవలం రెండు గంటల సమయం మాత్రమే పటాసులు కాల్చుకునేందుకు అనుమతిస్తూ కీలక తీర్పును వెలువరించింది. అదే విధంగా బాణాసంచా ఆన్‌లైన్ విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

నిబంధనలను తుంగలోకి తొక్కి పటాసుల వినియోగం, విక్రయాలు సాగిస్తే పోలీసులదే బాధ్యతని స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. అయితే, బాణాసంచా వినియోగాన్ని మాత్రం పూర్తిగా నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాసులు కాల్చాలని సూచించింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది.

క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35 నిమిషాలపాటు పటాసులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్‌లైన్‌లో బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం అతితక్కువ కాలుష్యాన్ని వెలువరించే పర్యావరణహిత పటాసులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా పటాసుల తయారీ, వాటి విచ్చలవిడి వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది దేశరాజధాని కాలుష్యంతో తల్లడిల్లిన నేపథ్యంలో ఢిల్లీ చిన్నారులు అర్జున్ గోపాల్(3), ఆరవ్ భండారి(3), జోయారావ్ భాసిన్(5), వారి తల్లిదండ్రులు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

వీటిపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 28న పిటిషన్లపై విచారణను పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం దీపావళి సమీపిస్తుండటంతో మంగళవారం తీర్పును వెలువరించింది. పటాసులపై దేశవ్యాప్త నిషేధం సాధ్యంకాదని స్పష్టంచేసిన న్యాయస్థానం వాటి అమ్మకాలపై, వినియోగంపై మాత్రం షరతులు విధించింది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే, పర్యావరణానికి హాని కలిగించని పటాసులను మాత్రమే విక్రయించాలని పేర్కొంది. వీటి ధ్వని కూడా తక్కువ మోతాదులో ఉండేలా చూడాలని సూచించింది.

క్యాన్సర్ ఇతర అనారోగ్యాలకు దారితీసే కాపర్ సమ్మేళనాలను, హానికారక యాంటిమొనీ సల్ఫైడ్‌ను బాణాసంచా తయారీలో వాడరాదని తేల్చిచెప్పింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ పోర్టల్స్ ఆన్‌లైన్‌లో పటాసుల అమ్మకాలను నిర్వహించరాదని ఆదేశించిన న్యాయస్థానం తమ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లైసెన్సు కలిగిన దుకాణాలు మాత్రమే వాటిని విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఒకవేళ ఎక్కడైనా నిషేధిత పటాసులను విక్రయించినట్లు తేలితే ఆ ప్రాంత పోలీస్ అధికారులను బాధ్యులను చేస్తామని స్పష్టంచేసింది. పటాసులు కాల్చేందుకు సమయాన్ని కూడా సుప్రీం కోర్టు నిర్దేశించింది. దీపావళినాడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 11.55 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు కేవలం 35 నిమిషాలపాటు పటాసులు కాల్చుకోవచ్చునని స్పష్టంచేసింది.

ఎన్సీఆర్ ఢిల్లీ పరిధిలో ఎవరికివారు వ్యక్తిగతంగా కాకుండా, బృందాల (కమ్యూనిటీల)వారీగా పటాసులు పేల్చడాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. దేశ రాజధాని (ఎన్సీఆర్) పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే పటాసులు కాల్చాలని, దీపావళికి ఏడు రోజుల ముందు నుంచి పండుగ తర్వాత ఏడు రోజుల వరకు గాలి నాణ్యత ఎలా ఉందో ఎప్పటిప్పుడు కేంద్ర కాలుష్యమండలి పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొంది.

బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. మొత్తానికి పటాసుల అమ్మకం, వినియోగంపై నిషేధానికి సంబంధించి ఇటు ప్రజల, అటు వ్యాపారుల వాదనలను సుప్రీంకోర్టు ఏడాదికాలంగా విన్నది. గత ఏడాది దీపావళి సందర్భంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పటాసుల అమ్మకాలపై సుప్రీం కోర్టు నెలరోజుపాటు తాత్కాలిక నిషేధం విధించింది.

కానీ, దీపావళి రోజున ఢిల్లీలో అనుమతించిన కాలుష్యస్థాయికన్నా 6.6 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా (క్యూబిక్ మీటరుకు 397 మైక్రోగ్రాములు) కాలుష్యతీవ్రత నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. మరి తాజా నిబంధనలు కాలుష్యాన్ని ఏమేరకు కట్టడి చేస్తాయో చూడాలి.