• ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • అనూహ్యంగా పెరిగిన ప్రవాహం

  • జలవనరుల శాఖ అప్రమత్తం

  • అనుక్షణం పర్యవేక్షిస్తున్న సీడబ్ల్యూసీ

  • లోతట్టు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి

  • సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం

  • తెలంగాణ వ్యాప్తంగా నిండుకుండల్లా జలాశయాలు

  • భారీ వర్షాలకు కుదేలైన అడవుల జిల్లా ఆదిలాబాద్

  • మంచిర్యాల-నిర్మల్ సహా పలు జిల్లాలదీ అదే పరిస్థితి

  • అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి తన్నీరు

రాజమహేంద్రవరం, హైదరాబాద్, అక్టోబర్ 24 (న్యూస్‌టైమ్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటు తప్పలేదు. గురువారానికి అనూహ్యంగా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గురువారం భారీగా వరద పోటెత్తింది. ఈ విషయాన్ని జలవనరుల శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు కోనసీమ, ఇతర తీర మండలాల్లో ప్రజలను యంత్రాంగం అప్రమత్తం చేసింది.

ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 6.2 అడుగుల నీటిమట్టం ఉండగా సముద్రంలోకి 4.52 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరంలో 8.91 మీటర్లు, పేరూరులో 13.26 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.05 మీటర్లు, భద్రాచలంలో 41.9 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. ధవళేశ్వరం ఆనకట్టకు బుధవారం సాయంత్రానికే భారీగా వరదనీరు చేరిందని తెలిపారు. గోదావరికి వరద గణనీయంగా పెరిగడంతో కోనసీమలో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇప్పటికే గత వారం రోజులుగా గోదావరి ఉద్ధృతితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న లంక గ్రామాల ప్రజలు రానున్న వరద ముప్పుతో భీతిల్లుతున్నారు. మరోవైపు కోనసీమపై ప్రత్యేక దృష్టి నిలిపిన యంత్రాంగం ముందస్తు సహాయ చర్యలను వేగవంతం చేసింది. కాగా, గోదావరికి వరద పోటు అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోపక్క, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.2 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విలీన మండలాల్లో శబరీ నదికి వరద నీరు పోటెత్తింది. చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం మండలాల్లో రహదారులు నీట మునిగాయి.

దేవీపట్నం మండలంలోని సీతపల్లి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో గోదావరి తీరంవెంబడి ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. అటు కోనసీమలోనూ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు నాటుపడవలపై రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలావుండగా, తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ మున్సిపాలిటీ పరిధి దుమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు పొట్టకూటి కోసం కాకినాడ పోర్టు నుంచి ఈనెల 6న వేటకు బయలుదేరి తుపానులో చిక్కుకొని 5 రోజుల పాటు నరకయాతన అనుభవించి, మూడు రోజులుగా తిండీతిప్పలు లేక ప్రాణాలు దక్కించుకొని 9 రోజుల తర్వాత క్షేమంగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేటకు చేరుకొన్నారు.

కాకినాడ పురపాలక సంఘం పరిధిలోని దుమ్ములపేటకు చెందిన ఎరిపిల్లి సత్తిబాబు, దాసరి కొయిరాజు, మరుపిల్లి సింహాద్రి, గరికిని అప్పారావు, ఎరిపిల్లి లక్ష్మయ్య, గరికిని ఆనందరావు, పేర్ల సత్తిబాబులు కాకినాడకు చెందిన మోసాపేత్రోకు చెందిన బోటులో కాకినాడ తీరం నుంచి వేటకు బయలుదేరారు. మూడురోజుల పాటు వేట సాగించి చేపలు సేకరించారు. మరో రెండు రోజులు వేట సాగిద్దామనుకొనేలోపు సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా మారడం, కెరటాల తాకిడి, గాలిప్రభావం పెరగడంతో వారు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

ఎటు వెళ్లిపోతామో ఏమైపోతామో ఇంటికి క్షేమంగా చేరుతామా అన్న ఆందోళన మత్స్యకారులు అందరిలోనూ నెలకొంది. ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు తమకు కావలసిన 400 లీటర్ల డీజిల్‌, 6 రోజులకు తగిన రేషన్‌ వెంట తీసుకెళ్లారు. దీంతో అప్పటికే సముద్రంలో పట్టిన చేపలను నాలుగు రోజుల పాటు తిన్నారు. ఉన్న చేపలు పాడవడంతో వాటిని సముద్రంలోనే పారవేశారు. వారం నుంచి తిండీ లేకపోవడం, మరోవైపు డీజిల్‌ అయిపోవడంతో తెరచాప సాయంతో కెరటాల పరిస్థితిని పసిగట్టి తీరప్రాంతం వైపు సాగారు.

200 కిలోమీటర్ల దూరం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గంగమ్మ తల్లిని స్మరిస్తూ చివరికి గురువారం మంచినీళ్లపేట తీరానికి చేరుకొన్నారు. కాకినాడ నుంచి స్థానిక మత్స్యకారులకు సమాచారం అందడంతో ఎంఎన్‌పేటకు చెందిన వంక చిరంజీవి బోటు సాయంతో వీరంతా క్షేమంగా తీరానికి చేరుకున్నారు. బోటు ఎక్కడా బోల్తాపడే సంఘటన చోటుచేసుకోలేదని లేకుంటే లైఫ్‌జాకెట్లు లేనందుకు చాలా ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు సురక్షితంగా చేరుకొన్న మత్స్యకారులు. వేట సాగిస్తున్న సమయంలో సముద్రంలోని 20 పర్ల వలలను లోపలకు లాగేందుకు వీల్లేక వదిలేశారు.

దీంతో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని, అదేకాక వేటాడిన రూ.1లక్ష సంపద పాడైందంటున్నారు మత్స్యకారులు. బోటుకు నష్టం జరగకపోవడంతో కొంత ఉపశమనం కలిగిందన్నారు. మత్స్యకారులు తీరం చేరుకొన్న విషయం తెలుసుకొన్న స్థానిక మాజీ సర్పంచి చిన్నారావు, మత్స్యకారులు చేరదీశారు. పలాస తెదేపా సమన్వయకర్త వెంకన్నచౌదరి, ఎంపీపీ జి.వసంతరావు, తెదేపా మండల అధ్యక్షుడు పాపారావు మంచినీళ్లపేట వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి వెంకన్నచౌదరి గ్లోసంస్థ ద్వారా రూ.5వేలు ఆర్థికసాయం అందించారు. ఎస్‌ఐ కె.వి.సురేశ్‌ మత్స్యకారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా కొనసాగుతుంది.

ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,18,913 క్యూసెక్కులు వస్తుండగా ఔట్‌ఫ్లో 1,13,608 క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1044.94 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటినిల్వ 9.62 టీఎంసీలుగా ఉంది. మరోవైపు, సుంకేశుల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. సుంకేశుల జలాశయానికి 1.87 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. 20 సాధారణ గేట్లు, 2 అత్యవసర గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు వదిలారు. దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

బ్యాక్ వాటర్‌తో రాజోలిలో పంట పొలాలు నీటమునిగాయి. అలాగే, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 42,385 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1065.70 అడుగులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 90.31 నిల్వ కాగా ప్రస్తుత నీటి నిల్వ 21.40 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు రాబోయే ఒకట్రెండు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఆల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

పలుచోట్ల కుండపోతతో పంటలు మునిగిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షంతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. మరో 48 గంటలపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా జిల్లాల్లో వానలు, వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, స్థానిక అధికారుల సమన్వయంతో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చెప్పారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, అధికారులు, పోలీసుల సహకారంతో అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలోకూడా సీనియర్ అధికారి నాయకత్వంలో 24 గంటలపాటు వర్షాల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ప్రజలకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, వాగులు, వంకలు పొంగి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నచోట మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం కోరారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.

జిల్లావ్యాప్తంగా 128.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దవాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. సుమారు పదివేల ఎకరాల్లో పంట నీట మునిగినట్టు అంచనా. దహెగాం మండలంలో ఎర్రవాగు ఉప్పొంగడంతో గిరివెల్లి గ్రామానికి చెందిన ఓ బాలింతరాలిని దాటించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షంతో గ్రామాల్లో చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

జిల్లావ్యాప్తంగా సగటున 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇచ్చోడలో అత్యధికంగా 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జైనథ్ మండలం తరోడ వద్ద వాగు పొంగి పొర్లడంతో హైలెవల్ వంతెన తెగింది. అంతర్రాష్ట్ర రహదారి గుండా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో వాగులు ఉప్పొంగడం వంతెనలు తెగి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సరఫరాను నిలిపివేశారు. కలెక్టర్ దివ్య, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాజేశ్వర్ రాథోడ్ తలమడుగు, తాంసి మండలాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు స్థానికులు భోజన ఏర్పాట్లు చేశారు.

బేల, జైనథ్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఆదిలాబాద్, ఇచ్చోడ, సిరికొండ, బజార్‌హత్నూర్, నేరడిగొండ, భీంపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల్లో భారీగా పంటనష్టం వాటిల్లింది. దాదాపు 1.23 లక్షల ఎకరాల్లో రైతులు.. పత్తి, సోయా, కంది పంటలు నష్టపోయినట్లు అంచనా. నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం 58.8మి.మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా భైంసా మండలంలో 95.2మి.మీ వర్షం కురిసింది. గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భైంసా మండలం కత్‌గాం వద్ద సుద్దవాగులో చిక్కుకున్న ఇద్దరు పశువుల కాపరులను అధికారులు రక్షించారు.

వర్షంతో కామారెడ్డి జిల్లా తడిసి ముద్దయింది. పలుచోట్ల పాత నివాసగృహాలు కూలిపోయాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వరదనీరు దిగువకు ఉరకలెత్తుతోంది. జిల్లాలో సగటు వర్షపాతం 27.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా నీటిమట్టం పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో 36.8 శాతం వర్షపాతం నమోదైంది.

ఇందూర్‌లోని ఆటోనగర్, మాలపల్లి, పెద్దబజార్, ఎన్జీవో కాలనీలు జలమయమయ్యాయి. మోపాల్ మండలంలోని కాల్పోల్ వెళ్లే దారిలో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. సాధారణ వర్షపాతం 8.5 మిల్లీమీటర్లు కాగా, 38.మిల్లీమీటర్లుగా నమోదైంది. వీర్నపల్లి మండలంలో వాగులు పొంగుతున్నాయి.

ఎల్లారెడ్డి మండల కేంద్రానికి, మరిమడ్ల, నిమ్మపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో 2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలో సగటు వర్షపాతం 15.1 మి.మీటర్లుగా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్‌లో కురిసిన వర్షానికి మూసీనదిలో నీటి ప్రవాహం పెరిగింది. భువనగిరి నుంచి భూదాన్‌పోచంపల్లి వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలో భారీవర్షాలకు పలుచోట్ల వాగు, వంకలు పొంగాయి.

జగిత్యాల జిల్లాలో సరాసరి వర్షపాతం 61.4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జన్నారం మండలకేంద్రంలోని పొనకల్ వాగుపై నూతన వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా, దాని పక్కన వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది.

మండలకేంద్రానికి మంచిర్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్ నుంచి రావాల్సిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. మావల మండలం వాఘాపూర్ వాగులో చిక్కుకున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను అటవీ శాఖ మంత్రి జోగు రామన్న రక్షించారు. స్థానిక పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న రమేశ్, ప్రవీణ్‌కుమార్, చంద్రశేఖర్, సుజాత ఆదిలాబాద్ నుంచి కారులో విధులకు హాజరయ్యేందుకు వెళ్లారు. వైజాపూర్ వాగులోంచి వెళ్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాగులోనే చిక్కుకున్నారు. స్థానికులు ఈ సమాచారాన్ని జిల్లా కేంద్రంలో ఉన్న మంత్రి జోగు రామన్నకు చేరవేశారు. వెంటనే స్పందించిన మంత్రి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేసి ఘటన స్థలానికి చేరుకున్నారు.

ఫైర్ సిబ్బంది తాడు సహాయంతో వాగులో చిక్కుకున్న నలుగురు ఉపాధ్యాయులను రక్షించారు. మంత్రి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని రెండు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం వరకు 21,660 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఉత్పత్తి రూపేణా రూ.5.41 కోట్ల నష్టం సింగరేణి సంస్థకు వాటిల్లింది. బుధవారం మధ్యాహ్నం వరకు ఓపెన్ కాస్టు గనుల వద్ద 38.4 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు సింగరేణి అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా, కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో తూర్పు ఆగ్నేయదిశగా కేంద్రీకృతమై ఉంది. పశ్చిమదిశగా ప్రయాణించి 24 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొంది. మిగతా జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకోవైపు, కృష్ణమ్మ పరవళ్లు తొక్కతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇదే స్థాయిలో వరద కొనసాగితే వారం వ్యవధిలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెద్దమొత్తంలో వస్తుండటంతో నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇటు తుంగభద్ర, అటు ఆల్మట్టి నుంచి వస్తున్న వరద కృష్ణమ్మలో కలుస్తోంది. స్పిల్‌వే గేట్లు, పవర్ జనరేషన్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మపై ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టుల్లోని అన్ని పవర్‌హౌస్ యూనిట్లను ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ఆల్మట్టికి గురువారం ఉదయానికి 1.19 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు 1.51 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. తుంగభద్రకు 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో నమోదయింది. మంత్రాలయం దగ్గర హెచ్చరిక స్థాయి (310 మీటర్లు) దాటి 310.94 మీటర్లపైన ప్రవహిస్తోంది. ప్రమాదస్థాయి (312 మీటర్లు) దాటడంతో (312.15) సీడబ్ల్యూసీ హెచ్చరికలు జారీచేసింది.

మరోవైపు, గోదావరి బేసిన్‌లోనూ వరద పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు 2.39 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, 3.4 లక్షలు విడుదలచేస్తున్నారు. సుంకేసులకు 1.81 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1.78 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టుకు 69వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 7 గేట్లుఎత్తి 68 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

తాలిపేరు ప్రాజెక్టులోకి వరద చేరడంతో 22 గేట్లు ఎత్తి 98 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల్లోకి భారీగా వస్తున్న వరదలతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను హెచ్చరించారు.

గురువారం వరద పరిస్థితిని ఆయన అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రాజెక్టుల దగ్గరే ఉండి పరిస్థితులను అంచనావేసి కేంద్ర కార్యాలయానికి, ఫ్లడ్ కంట్రోల్‌రూం, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 38 సెంటీమీటర్ల మేర వర్షం పడినా ఒక్క చెరువుకట్ట కూడా తెగలేదని, ఇది మిషన్‌ కాకతీయ విజయమని హరీశ్ తెలిపారు.