దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది హోరెత్తించే టపాసులు, వెలుగులు విరజిమ్మే దీపాలు. ఎంతటి పేదవారైనా, ధనవంతులైనా దీపావళి నాడు మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు అందమైన కొవ్వొత్తులతో ఎన్నో రంగులలో, రకరకాల ఆకారాల్లో ప్రమిదలు వస్తున్నా ఆ మట్టి ప్రమిదలలో ఉన్న సరళమైన, ప్రశాంతమైన అందం వాటికి లేదేమోనని అనిపిస్తుంది. ఇప్పుడు మామూలు మట్టితో చేసిన ప్రమిదలను కూడా మరింత అందంగా చేసుకోవచ్చు. మార్కెట్‌లో ఈ ప్రమిదలు ఎన్నో డిజైన్లలో లభిస్తున్నాయి. ముఖ్యంగా టెర్రకోట ప్రమిదలు అందమైన ఆకారాలలో విరివిగా అమ్ముతున్నారు.

అవి తెచ్చుకుని మీ సృజనాత్మకతతో మరింత అందంగా చేయండి. వీటికోసం ఎక్కువ సామాగ్రి అవసరం లేదు. పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ చేసే అలవాటు ఉంటే మీ దగ్గరున్న ఫ్యాబ్రిక్‌ పెయింట్స్‌, చిన్నచిన్న అద్దాలు, చెకీలు, సీక్వెన్స్‌, పూసలు, ముత్యాలు, రంగురంగు బట్ట ముక్కలు చాలు. ముందుగా ప్రమిదలను నీళ్లల్లో గంటసేపు నానబెట్టి ఆరబెట్టాలి. తర్వాత మీకు నచ్చిన డిజైన్‌ని ఆలోచించుకోండి.

ఒకే డిజైన్‌లో కనీసం ఆరు లేదా పన్నెండు ప్రమిదలు తయారుచేసుకుంటే మంచిది. దీని కోసం ఆక్రిలిక్‌, గ్లిట్టర్‌ పెయింట్స్‌ వాడితే మరింత అందంగా ఉంటాయి. ముందుగా ప్రమిదలకు మీరు నిర్ణయించుకున్న డిజైన్లను బ్రష్‌ సాయంతో రంగులు వేయండి. మామూలు రంగులు కాకుండా లైట్‌, డార్క్‌ మిక్స్‌ చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. పెయింటింగ్‌ అయ్యాక వేరే రంగుతో మీకు నచ్చిన డిజైన్లు వేయొచ్చు లేదా ప్రమిదకు ఉన్న డిజైన్లోనే మరిన్ని మెరుగులు దిద్దొచ్చు. ఇలా రంగులు వేశాక ఫెవికాల్‌ సాయంతో అక్కడక్కడా చిన్న అద్దాలు అతికించాలి. వాటి చుట్టూ పూసలు, చెకీలు లేదా ముత్యాలు అతికించొచ్చు.

వీలైతే చిన్న మువ్వలు కూడా పెడితే మరింత అందంగా ఉంటుంది. జరీ నెట్‌ బట్టతో చిన్న పువ్వులు చేసి కూడా అతికిస్తే బావుంటుంది. విదేశాల్లో ఉండేవారికి మట్టి ప్రమిదలు దొరకడం చాలా కష్టం. అలాంటప్పుడు గోధుమ పిండితో కూడా ప్రమిదలు తయారుచేసుకోవచ్చు.

లేదా పిల్లలు బొమ్మలు చేయడానికి వాడే క్లే కాని, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో మీకు నచ్చిన డిజైన్లలో ప్రమిదలు తయారుచేసుకుని రంగులేసుకుని హంగులు చేర్చండి. ప్రమిదలకు పెయింటింగ్‌ చేశాక వాటిని కనీసం 24 గంటలు ఆరనివ్వాలి. చిన్నచిన్న ప్రమిదలే కాక బొమ్మలతో కూడిన ప్రమిదలు, రెండు మూడు అంతస్థులలో ఉండే ప్రమిదలు కూడా దొరుకుతున్నాయి. కొన్ని వేలాడదీసేవి కూడా ఉంటాయి.

అలాగే దీపావళి నాడు మంగళహారతి పట్టడానికి, పూజ చేయడానికి వాడే పళ్లాన్ని కూడా అందంగా అలంకరించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here