A devotee lights oil lamps at a religious ceremony during the Diwali or Deepavali festival at a Hindu temple in Colombo, Sri Lanka.

అసురులపై దైవత్వ విజయాన్నే దీపావళి పండుగగా జరుపుకొంటామని బహుకొద్ది మందికి మాత్రమే తెలుసు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుం టారని చాలా మంది భావిస్తుంటారు. రావణుడు అసురశక్తి కాగా, రాముడు ఈశ్వరీయ శక్తికి ప్రతీక. ఈ విధమైన జ్ఞానదీపం వెలిగించని దీపావళి నిరర్ధకం. దీపావళి! యావత్‌ భారతావనికి ప్రత్యేక పండుగ.

అన్ని వయస్సుల వారిని ఆనందోత్సాహాల్లో తేలియాడజేసే పండుగ. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా, గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తారతమ్యం లేకుండా అంతా కోలాహలంగా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటామనే విషయంపై ఎన్నెన్నో కథలున్నాయి. నరకుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించాడని చెబుతారు. ఈ కథనం ఆధారంగానే పండుగ వేళ నరక చతుర్దశి జరుపుకుంటారు. దీన్నే చిన్న దీపావళిగా వ్యవహరిస్తారు. మరుసటి రోజును పెద్ద దీపావళిగా నిర్వహిస్తారు. దీనికి బలి చక్రవర్తి కథను ముడిపెట్టారు. దైత్యుల రాజైన బలి మొత్తం భూమండలాన్ని పాలిస్తుంటాడు. ఆ కాలంలోనే భూమిపై రాక్షసత్వం ప్రబలిపోయింది. ధర్మం, నియమ నిష్టలు వక్రమార్గం పట్టాయి. ఇదే క్రమంలో బలి చక్రవర్తి శ్రీలక్ష్మిని, ఇతర దేవతలను సైతం తన కారాగారంలో బంధించాడు.

దీంతో విష్ణుమూర్తి వామనావతారంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపించివేసి, దేవతలను విడిపిస్తాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా దీపావళి రాత్రి నాడు దీపాలపండుగ జరుపుకుంటారని ప్రతీతి. అందుకోసం ఇంటి ముందు కళ్ళాపి చల్లి, రంగవల్లులు తీర్చిదిద్ది అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరచి శ్రీమహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఇది అంతా కథనేనా? మరేదైనా పరమార్థం ఉందా? అని పరిశీలించాలి. జ్ఞాన దృష్టితో చూస్తే, దీని అర్థం నరకాసుర మాయ. మనోవికారాలనే దీనికి పర్యాయంగా చెప్పవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలని చెబుతారు. వీటిపై విజయం సాధించడం ఎంతో కష్టం.

గీతా సారంలో మాయకు మరో అర్థంగా బలిని చెప్పారు. కలియుగం అంతమయ్యే సమయంలో స్రీ, పురుషుల్లో ఇలాంటి వికారాలే రాజ్యం చేస్తాయని, అప్పుడు ఈ సృష్టి నరకంగా మారుతుందని పేర్కొన్నారు. నరకం నుంచి బయటపడాలంటే ఈశ్వరీయ జ్ఞానం ఒక్కటే మార్గం. పరమపిత పరమాత్మ వికారాల రూపంలో ఉన్న నరకాసురుడిని అంతం చేశారు. అందుకే ఇది అత్యంత మహత్వపూర్వక వృత్తాంతంగా గుర్తు చేసుకుంటూ కార్తీక కృష్ణపక్ష చతుర్దశిని చిన్న దీపావళిగా జరుపుకుంటారు.

తదనంతరం శ్రీలక్ష్మీ నారాయణుడిని రాజ్య ఆరంభం, సత్య యుగ ఆరంభానికి ప్రతీకగా తరువాతి రోజును పెద్ద దీపావళి పర్వదినంగా నిర్వహిస్తారు. చిన్న దీపావళి, పెద్ద దీపావళిల కంటే ముందు వచ్చే చీకటి రాత్రి దంతేరస్‌. దీప దానం చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఎవరైతే దీప దానం చేస్తారో వారు అకాల మృత్యువు నుంచి రక్షింపబడుతారని చెబుతారు. దీపదానం అర్థం జ్ఞానదానమే. దీప దానం సందర్భంగా మట్టితో చేసిన ప్రమిదలను మాత్రమే దానం చేయడం శ్రేయస్కరమని చెబుతారు.

పూర్వం దీపావళి వేడుకలను పక్షం రోజుల పాటు జరుపుకునే వారు. ఆధునిక పద్ధతుల్లో, కొవ్వొత్తులతో, ఎలక్ట్రిక్‌ బల్బులతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుండడం వల్లే ఆ దేవికి భారతదేశంలో స్థానం లేకుండా పోయిందని కొందరు భావిస్తుంటారు. నేడు అవినీతి, ఆశ్రీత పక్షపాతం, బంధుప్రీతి, స్వార్థం, అసూయ, ఈర్ష్యలతో దేశం నరకంగా మారిపోయింది. ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. దేశాల పాలకులు బలి చక్రవర్తి మాదిరిగా ఈ ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో ప్రజలు గాడాంధకారంలో జీవిస్తున్నారు. ప్రజల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించేందుకు ప్రయత్నించడం ద్వారా మానవాళిని జ్ఞానమార్గం వైపు నడిపించవచ్చు.