అక్కోజ్‌ (దుబాయ్): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువస్తే వలస వెళ్లిన గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ ఇచారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. గల్ఫ్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణకు చెందిన దాదాపు 10 లక్షల మంది గల్ఫ్‌ వలస వెళ్లారని, అక్కడ ఉన్న వారి బాగోగులు చూసేందుకు, అక్కడ అనారోగ్యంతో బాధుతున్నా లేక ఎవరైనా మరణించినా ఆ కేంద్రం ద్వారా సహకారం అందిస్తామన్నారు.

ఎఐసిసి తెలంగాణ ఇంచార్జి ఆర్‌సీ కుంతియా, ఎఐసిసి కార్యదర్శి మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే టి జీవన్‌ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ ఎస్వీ రెడ్డి తదితర ఇతర సీనియర్‌ నాయకులతో కలిసి దుబాయ్‌లోని అక్కోజ్‌లోని లేబర్‌ క్యాంపుల్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నారో, గల్ఫ్‌లో ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటో నేరుగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యల్ని టీఆర్ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. గల్ఫ్‌ కార్మికులతో బలవంతంగా పనిచేయిస్తున్నారని, అమానుష పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాల్లో తెలంగాణకు చెందిన 900 మంది వలస కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో చనిపోయారని, వారి కుటుంబాలకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఒక సమగ్ర ఎన్నారై విధానం అమలులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌ దేశాల్లోని రాయబార కార్యాలయల్లో తమ గోడును బాధిత కార్మికులు చెప్పుకోలేకపోతున్నారని, హిందీ, ఇంగ్లిషు బాషలు రాకపోవడం వల్ల సమస్యలు జఠిలం అవుతున్నాయని చెప్పారు. అందుకే ఫెసిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, గల్ఫ్‌కార్మికుల కష్ట సమయాల్లో చేదోడుగా ఉండేలా చేస్తామన్నారు. ఈ కేంద్రాలు అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో ఉండేలా రాబోయే కాంగ్రెస్‌ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ నుండి వచ్చిన ఎంతోమంది వలస కార్మికులకు ఆంగ్లం లేదా హిందీ మాట్లాడ లేకపోవడం, అధికారులకు తెలుగు భాష అర్థం కాకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. అందుకే రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వం రాయబారకార్యాలయాల్లో తెలుగు కూడా మాట్లాడే అధికారులు నియమించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

రూ.500 కోట్లతో ఫండ్‌ ఏర్పాటు చేసి గల్ఫ్‌ వలస కార్మికులను ఆదుకుంటామన్నారు. అనారోగ్య కారణంగా గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చిన కార్మికులకు రూ. 5లక్షల వరకూ ఉచిత ఆరోగ్య బీమా వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో అనారోగ్యం వల్ల ఇతర కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. అనారోగ్యంతో తెలంగాణకు వచ్చిన తర్వాత మరణించిన వారి కుటుంబాలకు కూడా చెల్లిస్తామన్నారు. గల్ఫ్‌ వలస కార్మికుల పిల్లల చదువులు, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే హైదరాబాద్‌లో సౌదీ, యూఏఈ రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. వలసలకు ఎందుకు వెళ్లాల్సివస్తోందో, సమస్యలు, వాటి నివారణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఎన్ఏసీ) సెంటర్‌ను బలోపేతం చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తామని ఉత్తమ్‌ తెలిపారు.

గల్ఫ్‌ వర్కర్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వలస కార్మికులకు, అక్కడి జైళ్లల్లో మగ్గుతున్న ఎన్ఆర్ఐలకు న్యాయ సహాయం అందిస్తామని ప్రకటించారు. రేషన్‌ కార్డులపై గల్ఫ్‌ వలస కార్మికుల వివరాలు ఉండేలా చేసి ఆరోగ్యశ్రీ వంటి పథకం వర్తించేలా చేస్తామన్నారు. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ల పథకాలను కొత్తగా ప్రవేశపెడతామన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన గల్ఫ్‌ వలస కార్మికుల జీవనోపాధి కోసం ఆర్థికంగా చేయూతనిస్తామని ఉత్తమ్‌ చెప్పారు.

తెలంగాణ ప్రజల భవిష్యత్తు డిసెంబర్‌ 7న తేలిపోతుందని, అందకని గల్ఫ్‌ వలస కార్మికులు అందరూ తెలంగాణలోని వారి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులందరితో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసేలా చెప్పాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు.

సాయంత్రం దుబాయ్‌లో నిర్వహించిన ‘దీపావళి ధూంధాం..’ కార్యక్రమంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆర్సీ కుంతియా ఇతర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఇందులో రెండు వేల మందికి పైగా గల్ఫ్‌ వలస కార్మికులు హాజరయ్యారు.