కరేబియన్ దీవులు, నవంబర్ 9: కరీబియన్‌ దీవుల్లో భారత మహిళలు సత్తా చాటారు. ప్రపంచ టీ20 తొలి మ్యాచ్‌‌లోనే న్యూజిలాండ్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించారు. కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ మహిళల జట్టు తడబడింది. రెండో ఓవర్‌లోనే భాటియా 9 పరుగుల వద్ద ఔట్‌ అయింది.

వెంటనే మందనా కూడా కేవలం 2 పరుగులకే పెవిలియన్‌ చేరింది. దీంతో ఓపెనర్స్‌ ఇద్దరూ ఔట్‌ అవ్వడంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో జెమిమా రోడ్రిగ్స్‌ తోడుగా ఆడి హెమలత (15 పరుగులు) కొద్దిసేపు ఆడినా క్యాచ్‌ ఔట్‌గా మైదానం వీడింది. దీంతో 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్, జెమిమా రోడ్రిగ్స్‌ న్యూజిలాండ్‌ ఫీల్డర్లను పరుగులు పెట్టించారు. కౌర్‌ ఏకంగా సిక్స్‌లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఈ దశలో 33 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసింది కౌర్‌. అనంతరం 39 బంతుల్లో జెమిమా కూడా అర్థ సెంచరీ చేసింది.

ఈ క్రమంలో మైదానమే హద్దుగా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఫీల్డర్లకు అవకాశం ఇవ్వకుండా మైదానంలో పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే 59 పరుగుల వద్ద రోడ్రిగ్స్‌ 59 పరుగుల వద్ద స్టంప్‌ ఔట్‌ అయింది. కేవలం 51 బంతుల్లోనే హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించింది. టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసి 201 స్ట్రైక్‌ రేట్‌తో చెలరేగిపోయింది.

అంతకు ముందు టీ20ల్లో కౌర్‌ బెస్ట్ స్కోర్‌ 77 పరుగుల కాగా తనకు ఇది తొలి శతకం, అందులోనే రికార్డు సృష్టించింది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటేనే బౌండ్రీల జోరు, సిక్సర్ల హోరు, పరుగుల వెల్లువ. వీరబాదుడు, బండబాదుడు, పిచ్చకొట్టుడు. ఇలాంటి ధనాధన్, ఫటాఫట్ ఆటలో మహిళలకు ప్రపంచకప్ ఏంటా అంటూ ఆశ్చర్యపోకండి. మూడక్షరాల ఆట క్రికెట్‌ను జెంటిల్మెన్ గేమ్ అంటారు. సిక్సర్లు, బౌండ్రీలు, పరుగులు, వికెట్లు, రికార్డులతో సాగిపోయే క్రికెట్లో మహిళలు సైతం పురుషులకు తీసిపోని విధంగా రాణిస్తున్నారు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ ఇన్ స్టంట్ వన్డే క్రికెట్ మూడున్నర గంటల్లో ధూమ్ ధామ్‌గా ముగిసిపోయే టీ-20 ఫార్మాట్లో సైతం మహిళలు పోటీపడుతున్నారు.

20 ఓవర్లు 60 థ్రిల్స్‌గా సాగిపోయే వీరబాదుడు, యమదంచుడు టీ-20 ఫార్మాట్లో 2018 మహిళా ప్రపంచకప్‌కు విండీస్ కమ్ కరీబియన్ ద్వీపాలు వేదికగా రంగం సిద్ధమయ్యింది. ప్రపంచ మహిళా క్రికెట్‌లోని పది అగ్రశ్రేణి జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మూడున్నర గంటల సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగిపోయే టీ-20 క్రికెట్ అంటేనే బాదుడు. బ్యాట్‌ను ఝళిపిస్తూ బౌండ్రీలు, సిక్సర్ల మోత మోగించడమే కాదు పరుగుల హోరెత్తించడం. ఇలాంటి ఫార్మాట్లో కేవలం పురుషులకు మాత్రమే కాదు మహిళలకు సైతం ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు. కేవలం తొమ్మిదేళ్ల క్రితం నుంచి మహిళలకు సైతం టీ-20 ప్రపంచకప్‌ను ఐసీసీ నిర్వహిస్తూ వస్తోంది.

2009లో లండన్ వేదికగా తొలిసారిగా మహిళా టీ-20 ప్రపంచకప్‌ను నిర్వహించారు. 2009లో ప్రారంభమైన మహిళా ప్రపంచకప్‌లో గత తొమ్మిదేళ్ల కాలంలోనే ఐదు ప్రపంచకప్ టోర్నీలు నిర్వహించారు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల షోగానే సాగుతూ వస్తోంది. ఇంగ్లండ్ వేదికగా 2009లో నిర్వహించిన ప్రారంభ ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.

2010 ప్రపంచకప్ నుంచి 2014 ప్రపంచకప్ వరకూ నిర్వహించిన మూడుటోర్నీల్లోనూ ఆస్ట్రేలియా విజేతగా నిలవడం ద్వారా హ్యాట్రిక్ సాధించింది. మహిళా ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా మూడు ప్రపంచకప్‌లు నెగ్గిన ఏకైకజట్టుగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్‌లో మాత్రం తొలిసారిగా టైటిల్ నెగ్గడం ద్వారా వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ఆధిపత్యానికి కరీబియన్ మహిళలు తొలిసారిగా గండి కొట్టి తమకు తామే సాటిగా నిలిచారు.

గత ఐదు మహిళా ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆస్ట్రేలియా మూడుసార్లు, ఇంగ్లండ్, విండీస్ ఒక్కోసారి టైటిల్ నెగ్గితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ చెరో రెండుసార్లు, ఆస్ట్రేలియా ఒకసారి రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకొన్నాయి. మహిళా టీ-20 ప్రపంచకప్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మూడుస్తంభాలాట మాత్రమే కాదని, నాలుగోస్తంభం రూపంలో తామూ ఉన్నామని 2016 ప్రపంచకప్ సాధించడం ద్వారా కరీబియన్ మహిళలు చాటుకొన్నారు. మహిళా టీ-20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ ఘనతను ఇంగ్లండ్ ప్లేయర్ చార్లొట్టీ ఎడ్వర్డ్స్ సొంతం చేసుకొంది.

చార్లొట్టీ 768 పరుగులు సాధించింది. ఇక, బౌలింగ్ విభాగంలో కంగారూ పేసర్ ఎల్సీ పెర్రీ నంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది. ఎల్సీ ఇప్పటి వరకూ 27 వికెట్లు పడగొట్టి అగ్రశ్రేణి బౌలర్‌గా రికార్డుల్లో చేరింది. మహిళా టీ-20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే ఆస్ట్రేలియా అన్నమాటే గుర్తుకు వస్తుంది. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లో మూడుసార్లు విజేతగా నిలవడంతో పాటు వరుసగా మూడుసార్లు ట్రోఫీ అందుకొన్న జట్టు కంగారూ టీమ్ మాత్రమే. మెరుపు వేగంతో సాగిపోయే టీ-20 మహిళా ప్రపంచకప్ అంటే ఆస్ట్రేలియా మాత్రమే అగ్రశ్రేణి జట్టుగా ముందు వరుసలో ఉంటుంది.

2010 ప్రపంచకప్ టోర్నీలో విన్నర్‌గా బోణీ కొట్టిన ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగిన 2012, 2014 పోటీలలో సైతం తిరుగులేని విజేతగా నిలిచింది. భారత్ వేదికగా ముగిసిన 2016 ప్రపంచకప్‌లో సైతం కంగారూ టీమ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఐదు ప్రపంచకప్ టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా మొత్తం 26 మ్యాచ్‌లు ఆడి 19 విజయాలు, 6 పరాజయాల రికార్డుతో ఉంది. మొత్తం 75 విజయశాతంతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా గుర్తింపు తెచ్చుకొంది. తాజా విజయంతో టీమిండియా మహిళల జట్టు కూడా ప్రపంచ జట్ల జాబితాలో తన సత్తా చాటుకున్నట్లయింది.