కర్నూలు: నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అర్హులైన 21,083 మంది లబ్దిదారులకు 58.75 కోట్ల స్వయం ఉపాధి రుణాలను ఈ నెల 12వ తేదీ మెగా గ్రౌండింగు మేలాలో పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు ఎస్. సత్యనారాయణ వెల్లడించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మెగా గ్రౌండింగు మేలా, ఆదరణ-2 పథకంపై మీడియా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ మెగా గ్రౌండింగ్ మేలా నిర్వహించి పేదరికంపై గెలుపు సాధించేందుకు అర్హులైన లబ్దిదారులకు రుణాలు పంపిణీ చేయనున్నామన్నారు.

2016-2017, 2017-2018, 2018-2019 ఆరిక సంవత్సరాలలో స్వయం ఉపాధి రుణాల నిమిత్తం ఆన్‌లైనులో దరఖాస్తు చేసుకొని అర్హులైన లబ్దిదారులందరికి ఈ నెల 12వ తేదీ మూడు రెవెన్యూ డివిజన్లలో మెగా గ్రౌండింగ్ మేలాలు నిర్వహించి పారదర్శకంగా రుణాల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. ఆదరణ-2 పథకం కింద 13,058 మంది లబ్దిదారులకు 19.59 కోట్ల రూ.ల విలువైన చేతి వృత్తుల పనిముట్లను మెగా గ్రౌండింగ్ మేలాలో పంపిణీ చేస్తున్నామన్నారు. గతంలో 70 శాతం వున్న సబ్సిడీ ప్రస్తుతం 90 శాతం సబ్సిడీతో చేతి వృత్తుల పనిముట్ల కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరిస్తూ అర్హులైన బిసి లబ్దిదారులకు కుల వృత్తి పనిముట్లు మంజూరు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లబ్దిదారులకు ఇబ్బందులు కలిగిస్తే మా దృష్టికి తీసుకరావాలని కలెక్టరు తెలిపారు. ఆదరణ పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక సెల్ ఎర్పాటుచేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కన్న మన జిల్లాలోనే బిసి లబ్దిదారులు అధికంగా వున్నారన్నారు.

నాణ్యమైన చేతి వృత్తుల పనిముట్లను సరఫరా చేస్తున్నామని పనిముట్లు నచ్చకపోతే మార్చుకొనే అవకాశం కూడ కల్పించామన్నారు. చుక్కల భూముల క్రమబద్దీకరణపై ఈ నెల 8 నుండి 19వ తేదీ వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో సర్వే జరిపి భూమి శిస్తు చెల్లించినట్లయితే సంబంధిత భూములకు పట్టా భూములు మంజూరు చేయనున్నట్లు కలెక్టరు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ పఠాన శెట్టి రవి సుభాష్, అన్ని కార్పోరేషన్ల ఈడీలు తదితరులు పాల్గొన్నారు.