• ముందస్తు ముచ్చటపై ‘కారు’ మబ్బులు

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీని రద్దుచేసిన రోజే రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు గులాబీ దళపతి.

ఇందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రజా ఆశీర్వాదం’ పేరిట శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన ఆవేశపూరితంగా మాట్లాడి విపక్షాలపై తన అక్కసును మరోమారు వెల్లగక్కారు. హామీల విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ముందు వరసలో నిలవగా అభ్యర్ధులను ప్రకటించడంలోను, ప్రచారానికి శంఖారావడం పూరించడంలోనూ కేసీఆర్ ముందున్నారనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ ముందస్తు ముచ్చట కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టిస్తుందనే ప్రచారం అప్పుడే ఊపందుకుంది.

గత మూడు దశాబ్దాల్లో ఇలా ముందస్తుకు వెళ్లడం ఇది మూడోసారి. అయితే అప్పట్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు జరగగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి ముందస్తు ఎన్నిక జరగనుండటం విశేషం. గత రెండు ఎన్నికలు 1985, 2004లో జరిగాయి. 1983లో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ఘనవిజయం సాధించింది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్‌ నాయకత్వంలో 201 సీట్లను గెలుచుకొని రికార్డు సృష్టించింది.

అనంతరం కొద్దికాలానికే రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేయడం, నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం రామారావుకు తిరిగి అధికార పగ్గాలు అప్పగించింది. ఆ సభలో తెలుగుదేశానికి చెందిన అనేక మంది ఫిరాయించడంతో రామారావుకు ఇబ్బందికరంగా ఉండేది. దీంతో మరోసారి ప్రజాతీర్పును కోరుతూ 1985లో సభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

1984లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు వెల్లువెత్తినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పోటీచేసిన 36 సీట్లలో 30ను గెలుపొందింది. 1984 నుంచి 1989 వరకు లోక్‌సభలో తెలుగుదేశమే ప్రధాన ప్రతిపక్షం కావడం విశేషం. 1985లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు వామపక్షాలు, భాజపాకు సీట్లను కేటాయించి పోటీలో దిగారు. మొత్తం 249 సీట్లకు పోటీచేసిన తెలుగుదేశం 209, సీపీఐ 11, సీపీఎం 11, భారతీయ జనతా పార్టీ 10 స్థానాలను గెలుచుకున్నాయి.

కాంగ్రెస్‌కు 50 సీట్లు మాత్రమే దక్కాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా తెలుగుదేశం తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. ఇక, 2004లో రెండో సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అప్పట్లో వాజ్‌పేయీ నాయకత్వంలోని ఎన్డీయే సైతం ముందస్తుకు సిద్ధం కావడంతో లోక్‌సభకు అసెంబ్లీకి కలిపి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది.

తెరాసతో పాటు ఇతరపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకున్న కాంగ్రెస్‌ 185, తెరాస 26, సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలుపొందగా తెదేపా 47 సీట్లతో ప్రతిపక్షంగా మిగిలింది. ఈ ఎన్నికల ఫలితాలు తెదేపాకు చేదు గుళికగా మిగిలాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ముచ్చట ఎలాంటి ఫలితాన్ని మిగల్చనుందన్న దానిపై విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేరుపడి కొత్త రాష్ట్రంగా తెలంగాణ 2014లో అవతరించింది. అసెంబ్లీ గడువు ముగిసేందుకు ఇంకా ఏడు నెలల వ్యవధి ఉండగానే సభను రద్దు చేసిన సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌లో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహిస్తారు.

లేకుంటే 2019 ఏప్రిల్‌ లేదా మే నెలల్లో ఎన్నికలు జరపనున్నారు. ఏదీ ఏమైనా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. అయితే, తాజా విశ్లేషణలు, అంచనాల ప్రకారం కేసీఆర్‌కు ముందస్తు ముచ్చట కలిసి రాకపోవచ్చు. విపక్షాలన్నీ ఏకమై సీట్లు పంపిణీ చేసుకుని పోటీకి దిగిన పక్షంలో అధికార పక్షం విజయం కోసం విశ్వప్రయత్నం చేయడం తప్పని పరిస్థితి.

మరోవైపు, తెలంగాణలో ఇప్పటికే తెరాసకు పోటీగా, వ్యతిరేకంగా ఆచార్య కోదండరామ్ లాంటి మేథావులు ఏకమై ప్రచారం నిర్వహించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు, ఓటములు అంత సులువు కాదన్నది సుస్పష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here