• నియంత్ర‌ణానుకూల వాటాను కొనుగోలు

  • 50 శాతం క‌న్నా త‌క్కువకు కేంద్ర పెట్టుబడి

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌లో కేంద్ర ప్ర‌భుత్వ వాటాను 50 శాతం క‌న్నా త‌క్కువ‌కు ప‌రిమితం చేసుకోవ‌డానికి అభ్యంత‌రం లేద‌ని తెలిపే ప్రతిపాదనకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే, ఈ బ్యాంకులో ప్ర‌భుత్వానికి ప్రస్తుతం ఉన్న నియంత్ర‌ణ పూర్వ‌క యాజ‌మాన్యాన్ని ర‌ద్దు చేసుకోవడానికి, ఒక ప్ర‌మోట‌ర్‌గా భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నియంత్ర‌ణానుకూలమైన వాటాను ప్రిఫరెన్శియ‌ల్ అలాట్‌మెంట్‌, ఓపెన్ ఆఫ‌ర్‌ ఆఫ్ ఎక్విటీ మార్గాల‌లో కొనుగోలు చేసేందుకు కూడా మంత్రివ‌ర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ కొనుగోలు ఇటు ఐడీబీఐ బ్యాంకుకు, అటు ఎల్ఐసీకే కాకుండా వినియోగ‌దారుల‌కు కూడా విస్తృత శ్రేణిలో సహకారి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుందన్న నమ్మకాన్ని ప్రభుత్వం వ్యక్తంచేస్తోంది. ఉభ‌య సంస్థ‌ల‌కు ప‌రిమాణం ప‌రంగా ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు, వినియోగ‌దారు సంస్థ‌లను ఆక‌ర్షించ‌డంలోను, పంపిణీప‌ర‌మైన ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌డంలోను, కార్య‌క‌లాపాల‌లో సామ‌ర్ధ్యాన్ని, స‌ర‌ళ‌త్వాన్ని పెంపొందించుకోవ‌డంలోను, ఉత్ప‌త్తుల, సేవ‌ల విక్ర‌యం లోనూ ఇతోధిక అవ‌కాశాల‌ లభ్యత వంటి లాభాలూ ద‌క్కనున్నయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ నిర్ణ‌యం ఇటు ఐడీబీఐ బ్యాంకుకు, అటు ఎల్ఐసీకి ఆర్థికంగా శ‌క్తిని స‌మ‌కూర్చ‌డ‌మే కాకుండా, గృహ నిర్మాణ సంబంధిత ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేయ‌డం, ఇంకా మ్యూచువ‌ల్ ఫండ్‌ల వంటి ఫైనాన్శియ‌ల్ ప్రోడ‌క్ట్స్‌ను అందిస్తున్న ఇరు సంస్థల అనుబంధ సంస్థ‌ల‌కు కూడా అండ‌దండ‌ల‌ను అందించ‌గ‌లుగుతుందన్న ఆశాభావాన్ని ఇరు సంస్థల యాజమాన్యాలు విశ్వాసంతో ఉన్నాయి. దీనికి తోడు, ఎల్ఐసీకి చెందిన 11 ల‌క్ష‌ల మంది ఏజెంట్ల బ‌ల‌గాన్ని బ్యాంకింగ్ సేవ‌ల‌కు వినియోగించుకొనే అవ‌కాశాన్ని బ్యాంకు పొంద‌గలుగుతుంది. దీని ద్వారా బ్యాంకు ఖాతాదారు సేవ‌లు మెరుగుపడి, అన్ని వ‌ర్గాల‌కు ఆర్థిక సేవ‌ల ల‌భ్య‌త విస్తృతం కాగలదు.

త‌క్కువ ఖ‌ర్చయ్యే డిపాజిట్ల సేక‌ర‌ణ, చెల్లింపు సేవ‌లకుగాను రుసుము రూపంలో వ‌చ్చే ఆదాయం ఈ మార్గాల‌లో నిధుల సేక‌ర‌ణ ప‌రంగా త‌క్కువ ఖ‌ర్చుతో కూడినటువంటి ప్ర‌యోజ‌నాన్ని పొందే స్థితికి బ్యాంకు చేరుకొంటుంది. బ్యాంకుకు చెందిన న‌గ‌దు నిర్వ‌హ‌ణ సేవ‌ల ల‌భ్య‌త‌తో పాటు, బ్యాంకుకు చెందిన 1,916 శాఖ‌ల నెట్‌వ‌ర్క్ ద్వారా బ్యాంక్ ఇన్స్యూరెన్స్ (బ్యాంకు ద్వారా బీమా ప‌థ‌కాల విక్ర‌యం వ‌గైరా)ను ఎల్ఐసీ పొంద‌గ‌లుగుతుంది. పైపెచ్చు, ఆర్థిక సేవ‌ల‌న్నిటినీ ఒకే చోటులో అంద‌జేయాన్న త‌న విజ‌న్‌ను నెర‌వేర్చుకోవ‌డంలో ఎల్ఐసీ మ‌రింత‌ ముందంజ వేయ‌గ‌లుగుతుంది. వినియోగ‌దారులు సైతం ఒకే క‌ప్పు కింద ఆర్థిక సేవ‌ల విస్తృతి తాలూకు ప్ర‌యోజ‌నాన్ని పొందుతారు.

ఎల్ఐసీ కూడా జీవిత బీమా ర‌క్ష‌ణ ప‌థ‌కాల‌ను మ‌రింత మందికి చేర‌వేయగ‌లిగిన స్థితికి చేరుకొంటుంది. ఇక, ఈ ప్రక్రియ పూర్వరంగ పరిణామాలను ఒకసారి పరికిస్తే, ఐడీబీఐ బ్యాంకులో ప‌రివ‌ర్త‌న ప్ర‌క్రియ ఆరంభ‌మైంద‌ని, ఆ బ్యాంకును ప్ర‌భుత్వం ముందుకు తీసుకుపోతుంద‌ని, అంతేకాకుండా బ్యాంకులో ప్ర‌భుత్వ వాటాను 50 శాతం క‌న్నా త‌క్కువ‌కు త‌గ్గించుకొనే ఐచ్ఛికాన్ని కూడా ప‌రిశీలిస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016లోనే త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఎల్ఐసీ త‌న బోర్డు ఆమోదాన్ని పొందిన అనంత‌రం ఐడీబీఐ బ్యాంకులో నియంత్ర‌ణ‌కు అనువైన వాటాను కొనుగోలు చేయ‌డం కోసం ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్ డివెల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఎఐ)ను అనుమ‌తించ‌వ‌ల‌సింద‌ని కోరింది. ఈ నేపథ్యంలో ఐఆర్‌డీఎఐ అనుమ‌తిని అందుకొన్న త‌రువాత సాధ్యాసాధ్యాల అధ్య‌య‌నాన్ని చేప‌ట్టి ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్ర‌ణానుకూల వాటాను కొనుగోలు చేయ‌డం ప‌ట్ల ఎల్ఐసీ త‌న ఆస‌క్తిని వ్య‌క్తం చేసింది. ఈ ఆఫ‌ర్‌ను బ్యాంకు బోర్డు ప‌రిశీలించిన అనంత‌రం, ప్ర‌తిపాదిత కొనుగోలు ఫ‌లితంగా ప్ర‌భుత్వ వాటా 51 శాతం క‌న్నా త‌క్కువ‌కు క్షీణించే అంశంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తెలుసుకోగోరింది.