• నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

  • పోలింగ్, ఫలితాల వరకూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు

  • తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

హైదరాబాద్: టీఆర్ఎస్‌ నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆశల్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఆవిరి చేసేసిందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి విమర్శించారు.

అప్పటికాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనీయా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చారని, అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు పాలనలో తెలంగాణలో అవినీతి, అసమర్థ, పక్షపాత పాలనకు తెర తీశారని విమర్శించారు.

వివిధ రంగాల్లోని ప్రజల్లో నిరాశ గూడు కట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా టీఆర్ఎస్‌ పాలనకు చరమగీతం పాడుదామా అని ఎదురుచూస్తున్నారని, ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్‌ చెప్పారు. అదృష్టవశాత్తు కేసీఆర్‌ తొమ్మిది నెలలు ముందుగానే అసెంబ్లీ ఎన్నికలకు రావడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు తమ ఓట్లు ద్వారా ఆశీస్సులు అందించేందుకు, కేసీఆర్‌ కుటుంబ అవినీతి, నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు, మేధావులు సిద్ధపడుతున్నారని, ప్రజలు తమ ఆకాంక్షలు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నెరవేరుతాయనే కలలు త్వరలోనే జరగబోయే ఎన్నికల ద్వారా నెరవేబోతోందని ఉత్తమ్‌ చెప్పారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు ఎన్నో ఆశలు, ఆశయాలు పెంచుకున్నారని, అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన లెక్కలేనన్ని హామీలను నమ్మిన ప్రజలు మోసపోయారని తెలిపారు.

టీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం, దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి, ముస్లింలు, ఎస్టీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు 12 శాతానికి పెంపుదల, పేదలకు రెండు పడక గదుల ఇండ్లు, ఇంటికో ఉద్యోగం పేరుతో యువత, నిరుద్యోగులను ఆకట్టుకునేలా లెక్కలేనన్ని హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఆ వాగ్దానాలు వేటినీ అమలు చేయకుండా కేసీఆర్‌ ఆ వర్గాలన్నింటినీ వంచించారని ఉత్తమ్‌ తీవ్రంగా విమర్శించారు.

కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామన్న హామీ కూడా ఇచ్చిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వాటి జోలికేపోలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలు రైతులు, యువత, విద్యార్ధులు, మహిళలు, మైనార్టీలు, దళిత, గిరిజనుల్లో లేనిపోని ఆశలు రేకెత్తించి తీవ్రంగా వంచించారని ఉత్తమ్‌ నిప్పులు చెరిగారు. ప్రజలను ఇంతగా దగా చేసిన టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇదే సరైన సమయమని, అన్ని వర్గాలు టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నవంబర్‌ నెలలో ఎన్నికలు జరిగే అవకాశముందని, ఈసారి ఎన్నికలు కేసీఆర్‌ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మధ్య జరగబోతోందని, టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులన్నీ రాబోయే రెండు నెలల్లో తమ శక్తియుక్తిల్ని పూర్తిగా పార్టీ కోసం వెచ్చించాలని, ఇది అత్యంత కీలక ఘట్టమని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ సందేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లాలని, టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఉత్తమ్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనన్న చారిత్ర విషయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు పూర్తి స్థాయిలో కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన ఏర్పర్చుకోవాలని, కాంగ్రెస్‌ చేయబోయే పథకాల గురించి పూర్తి సమాచారంతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

స్థానిక నేతల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, కాంగ్రెస్‌ కోసం శ్రమించిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని, కష్టకాలంలో కాంగ్రెస్‌ వెన్నంటే ఉన్న వారిని పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని ఉత్తమ్‌ భరోసా ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, అపద్ధర్మ సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘంలోని కొందరు అధికారులు కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉందని ఉత్తమ్‌ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎం)ల ద్వారా మోసాలకు తెరతీయాలని కుట్ర చేస్తున్నారని, ఈవీఎంల్ని ట్యాంపరింగ్‌ చేసే ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీల స్థాయిలోనే అడ్డుకునే ప్రయత్నం చేయాలని కోరారు.

ఈవీఎంల పనితీరు ఎలా ఉందో పరిశీలన చేయాలని, కనీసం ఒకో ఈవీఎంలో 50 ఓట్లు వేసి పరిశీలన చేయాలని, ఒక పార్టీకి ఓటు వేస్తే వేరే పార్టీకి నమోదు అవుతోందేమో క్షుణ్ణంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. మోదీ, కేసీఆర్‌లు ఓట్లను కూడా తప్పుడు మార్గంలో కొల్లగొట్టి ప్రజల ఓటు హక్కును హరించేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. రాజకీయంగా కాంగ్రెస్‌ నాయకులను ఎదుర్కొనలేని దయనీయస్థితిలో ఉన్నందును కేసీఆర్‌ పోలీసు అధికారులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.

‘‘పోలీస్‌ అధికారులు చట్ట ప్రకారం తమ విధుల్ని నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొందరు అధికారపార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్ష పార్టీ నేతల్ని వేధింపులకు గురిచేసే చర్యలకు పాల్పడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకాగానే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కొనాల్సివస్తుందని హెచ్చరిస్తున్నాను. టీఆర్ఎస్‌ నేతల చెప్పుచేతల్లో కీలుబొమ్మలుగా మారవద్దు. తప్పు చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టం. తీవ్ర పరిణామాలు ఉంటాయని మర్చిపోవద్దు. కేసీఆర్‌ సమయం ముగిసిపోయింది. ఈ విషయాన్ని కూడా గుర్తెరిగి వ్యవహరించండి’’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు.

‘‘కేసీఆర్‌ తిరిగి అధికారంలోకి రావడం కోసం నిసిగ్గుగా అక్రమదారుల్లో పయనిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు గల్లంతు చేయించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యేలా మోదీతో చేతులు కలిపి చేయాలని చూస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకీ పెరగడాన్ని చూసి పలువురు నేతలపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీస్‌ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అన్యాయంగా తప్పుడు పాస్‌ పోర్ట్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయించి జైలుపాలు చేశారు. మరో కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిలపై తప్పుడు కేసులు పెట్టించారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా కాంగ్రెస్‌ పార్టీ భయపడేదే లేదు. ప్రజల్లోకి వెళ్లి వాస్తవాన్ని వివరిస్తాం. కేసీఆర్‌ కుటుంబ అవినీతి, అక్రమాలను నిగ్గదీస్తాం. టీఆర్ఎస్‌ సర్కార్‌కు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పేలా చేస్తాం’’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించారు.