విశాఖపట్నం: ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణాన్ని చలార్చడానికి వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మళ్ల విజయప్రసాద్‌తో పార్టీకి చెందిన ఇతర నాయకులు శ్రీధర్‌కు సంఘీభావంగా ఎయిర్‌పోర్ట్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. మరోవైపు, అక్రమంగా అరెస్ట్‌ చేసిన తమ నాయకుడిని విడిచిపెట్టాలని స్థానికులు, కార్యకర్తలు గురువారం ఉదయం నుంచి పీఎస్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

దీంతో ఎయిర్‌పోర్ట్‌ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలు మాట్లాడుతూ పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నందువల్లే శ్రీధర్‌ను అరెస్ట్‌ చేసి ఉంటారని అన్నారు. గతరాత్రి ఎన్‌ఏడీ కొత్తరోడ్డు జంక్షన్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులు చేతబడి ప్రమోగించి పలువురి మరణానికి కారణం అవుతున్నారంటూ ఆరోపిస్తూ స్థానికులు వారిపై దాడికి దిగారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయారని, దీనికి ఆ దంపతులే కారణమని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు.

స్థానికులు ఆ దంపతులను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలలకొంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జియ్యాని శ్రీధర్‌తోపాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అనుకోకుండా అల్లరి చెలరేగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మహిళలను అని కూడా చూడకుండా చితకబాదారు. నాయకులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here