లుంగ్లెయ్‌(మిజోరం): శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న మిజోరంలో భాజపా, కాంగ్రెస్‌ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మిజోరంలో పర్యటించారు. ఈ సందర్భంగా లుంగ్లెయ్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్‌ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను నిందించడమే ఆ పార్టీ పని అని ఎద్దేవా చేశారు.

‘‘ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. అయితే ఆ పార్టీ ‘విభజించు – పాలించు’ సిద్ధాంతం దేశ ప్రజలకు అర్థమైంది. అందుకే ఇప్పుడు కేవలం రెండు మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు అధికారం దక్కింది. ఇలాంటి కాంగ్రెస్‌ సంప్రదాయాలను నుంచి బయటపడేందుకు మిజోరం ప్రజలకు బంగారం లాంటి అవకాశం వచ్చింది’’ అని మోదీ అన్నారు.

‘‘ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ దుస్తులపై కాంగ్రెస్‌ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలు నన్ను ఎంతగానో వేదనకు గురిచేశాయి. మీ ఆశలు, ఆశయాలు కాంగ్రెస్‌కు ఎప్పటికీ పట్టవు. వారి పోరాటం అధికారం కోసమే.. ప్రజల కోసం కాదు’’ అని మోదీ దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న భాజపా భారతీయ సంస్కృతి సంప్రదాయాల కోసం ఎంతగానో కృషి చేసిందని, మున్ముందు కూడా ఇలాగే పనిచేస్తుందని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘‘మన ప్రధాని దేశంలో ఎక్కడికి వెళ్లినా విదేశాలకు వెళ్లిన విచిత్రమైన, వింతవింత తలపాగాలు ధరిస్తుంటారు. మరి ముస్లింల టోపీ ధరించేందుకు ఎందుకు నిరాకరిస్తారు’’ అని శశిథరూర్‌ భాజపాను ప్రశ్నించారు. అప్పట్లో థరూర్‌ వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి.