న్యూఢిల్లీ: మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా లోక్‌సభ ఎన్నికలు జరిగే సంవత్సరంలో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ కాకుండా తాత్కాలిక ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ ప్రవేశపెడుతుంది. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

మన దేశంలో కొనసాగుతున్న సంప్రదాయం ఇదే. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి 2019లో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 ఫిబ్రవరి 1న జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ ప్రయత్నంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని భాజపా ప్రకటిస్తోంది.

‘‘మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేవలం ఎన్నికల కోసం ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేయలేం’’ అని సదరు అధికారి అభిప్రయపడ్డారు. ఇదిలా ఉండగా బడ్జెట్‌ ప్రసంగం కోసం గణాంకాలతో కూడిన వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఆర్థికశాఖ లేఖలు పంపింది. ఇటీవల మరోసారి ఈ అంశాన్ని గుర్తుచేసింది.

నవంబరు 30లోగా గణాంకాలు అందించాలని స్పష్టం చేసింది. కాగా, బడ్జెట్‌ సమావేశం తేదీలను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే. అంతకుముందు ఫిబ్రవరి నెలలో చివరి పనిదినం నాడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని పక్కనబెడుతూ 2017 నుంచి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్నారు. ఇక అంతకుముందు ప్రత్యేకంగా ప్రకటించే రైల్వే బడ్జెట్‌ను కూడా కేంద్ర బడ్జెట్‌తో కలిపే ప్రవేశపెడుతున్నారు.