మెల్‌బోర్న్‌: భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20 రద్దైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే. వర్షం కారణంగా ఆట రద్దవ్వడం అభిమానులను నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 19 ఓవర్లకు 132/7తో నిలిచింది. వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు.

ఆ తర్వాత కోహ్లీసేన లక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 137కు సవరించారు. టీమిండియా ఛేదన ఆరంభం అవుతుందనగా వర్షం మళ్లీ కురిసింది. మైదానం సిబ్బంది పిచ్‌పై కవర్లను అలాగే ఉంచారు. వరుణుడు కాసేపు తెరపినివ్వడం, కవర్లు తొలగించడం, ఆటగాళ్లు మైదానంలోకి రావడం.. మళ్లీ వర్షం రావడం ఇలా చాలాసేపు గడిచింది. సమయం లేకపోవడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను 11 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 90గా నిర్ణయించారు. మైదానం సిద్ధం కాగానే వానదేవుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.

వర్షం ఆగితే స్థానిక కాలమానం ప్రకారం 22:02 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమైతే కోహ్లీసేన 5 ఓవర్లకు 46 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. కాగా వరుణుడు పట్టువిడిచేలా కనిపించకపోవడంతో చివరికి మ్యాచ్‌ను రద్దుచేశారు. గబ్బాలో జరిగిన తొలి టీ20లో ఆసీస్‌ తొలి బ్యాటింగ్‌ చేసింది. 17 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను 45 నిమిషాలు నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్ లక్ష్యం పెరగడంతో కోహ్లీసేన 4 పరుగులు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here