బాలనటుడిగా సక్సెస్‌ అయిన తనీష్‌ హీరోగా సక్సెస్‌ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. తనీష్‌ తెరపై హీరోగా కనపడి చాలా కాలమే అయింది. ఇటీవలె బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన తనీష్‌ రంగు సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. విజయవాడ రౌడీషీటర్‌ లారా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన రంగు చిత్రం తనీష్‌ను హీరోగా నిలబెట్టిందా? అసలు ‘రంగు’ వెనుక కథేంటి? అన్నది ఓసారి చదివేద్దాం. కథలోకి వెళ్తే… బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది.

లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్‌ పోషించాడు. పవన్‌ కుమార్‌ అలియాస్‌ లారా (తనీష్‌) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్‌ ఫస్ట్‌. అయితే కాలేజ్‌లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం అటుపై రౌడీ షీటర్‌గా మారతాడు. అక్కడినుంచి సెటిల్‌మెంట్లు చేస్తూ ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్‌) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది.

మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (‌పరుచూరి రవి), మణి (షఫీ) పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది? అనేదే ‘రంగు’ అసలు కథ. లారా పాత్రలో తనీష్‌ బాగానే నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తడబడ్డట్టు అనిపించినా ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇక ఏసీపీ రాజేంద్రన్‌ పాత్రలో పరుచూరి రవి నటన గుర్తుండిపోతుంది.

ఆ పాత్రకు కావల్సిన బాడీలాంగ్వేజ్‌తో బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో తనీష్‌ తరువాత ఎక్కువగా కనిపించేది, గుర్తుండేది పరుచూరి రవి పాత్రే. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

ఓ వ్యక్తి రౌడీగా మారడానికి దారితీసే కారణాలు. ఆవేశంలో చేసే పనులు, ఆలోచన లేకుండా భవిష్యత్తును నాశనం చేసుకోవడం, తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలనుకోవడం అయినా గతం వెంటాడటం లాంటి సంఘటనల్లో సినిమా కావాల్సినంత కమర్షియల్ కంటెంట్‌ ఉంది. కానీ రంగు విషయంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నా కూడా వాటిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపిస్తుంది.

ఈ కథకు పరుచూరి బ్రదర్స్‌ మాటలు రాయడం ప్లస్‌ పాయింట్‌. వారి మాటలు మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అదే సమయంలో ఆలోచింపచేసేలా ఉన్నాయి. యోగేశ్వర్‌ శర్మ అందించిన సంగీతం ఫర్వాలేదు. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.