జైపూర్: భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత లాల్ కృష్ణ ఆడ్వాణీ తన సొంత ప్రాంతంగా భావించే రాష్ట్రం రాజస్థాన్. 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన భవిష్యత్తుకు పునాదిపడింది ఇక్కడి జైపుర్‌ నుంచే. రాజస్థాన్‌లో పర్యటించడం తనకెంతో సంతోషం కలిగిస్తుందని పలు ఇంటర్వ్యూల్లో పెద్దాయన చెప్పారు కూడా. పలు ఎన్నికల సందర్భంగా భాజపా అభ్యర్థుల తరఫున గతంలో ఎన్నోసార్లు రాష్ట్రంలో ప్రచారమూ చేశారు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడా కనిపించడంలేదు. ప్రస్తుత నాయకత్వం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసిందని, కనీసం స్టార్‌ క్యాంపెయినర్‌గానైనా ఆయన సేవలను వినియోగించుకోవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆడ్వాణీకి అన్యాయం జరుగుతోందంటూ తొలితరం భాజపా మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా! రాజస్థాన్‌లో వసుంధర రాజె సర్కారుపై ప్రజా వ్యతిరేకత ఉన్నా టికెట్ల కేటాయింపులో మాత్రం ఆమెదే పైచేయి అయింది.

తన విశ్వాసపాత్రులకు పట్టుపట్టి మరీ టికెట్లు ఇప్పించుకున్నారామె. ఆ సంగతి ఎలాగున్నా, రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్న అధిష్ఠానం అక్కడ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకుంది. గెలుపు భారాన్ని తనపై వేసుకుని ప్రచారాన్ని పక్కాగా నిర్వహించాలని యోచిస్తోంది. ప్రాంతాలు, వర్గాల వారీగా ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవాలనీ, పోలింగ్‌ నాటికి పరిస్థితిని తారుమారు చేసి ఎలాగోలా ఓట్లు కురిపించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

రాజె సర్కారు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం వాటి ఆధారంగా పదునైన రాష్ట్ర ప్రచార ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర శాఖ కూడా ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. వసుంధర ప్రచార కార్యక్రమాల కంటే మోదీ, షా ప్రచార సభలు, ర్యాలీల నిర్వహణకే అధిక ప్రాధాన్యమిస్తోంది. కాగా, రాష్ట్రంలో ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రచార కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నెల 25న అల్వార్‌, భిల్వారా, బేణేశ్వర్‌ ర్యాలీలతో ప్రారంభమయ్యే మోదీ ర్యాలీలు డిసెంబరు 4 వరకూ కొనసాగుతాయి.

కీలకమైన కోటా, నాగౌర్‌, భరత్‌పుర్‌, జోధ్‌పుర్‌, హనుమాన్‌గఢ్‌, జైపుర్‌, సికార్‌లలో ఏర్పాటుచేసే భారీ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనే అవకాశముంది. ఇక పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 27 నుంచి 29 వరకూ రాష్ట్రంలో ప్రచారం చేపట్టనున్నారు. ఇటీవల షా సభలకు పార్టీ శ్రేణులే అంతగా హాజరుకావడం లేదు. రాజెతో ఆయనకు అంతగా పొసగని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన పాల్గొనే ప్రచార సభలు ఎంతవరకూ విజయం సాధిస్తాయో చూడాలి.