హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పర్యటనంతా ఏపీ చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆమె ఏపీకి వరాలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలనుకున్నామని, రాజకీయంగా నష్టపోయినా మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీకి కూడా న్యాయం చేయాలని చట్టంలో హోదాను చేర్చామని, ఏపీకి ఇచ్చిన హోదాతో సహా అన్ని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని సోనియా చెప్పారు. ఇదే విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పలుమార్లు చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కాగా తెలంగాలో హోదాను సోనియా ప్రస్తావించటం ఏపీ కాంగ్రెస్‌కు నూతనోత్సాహం వచ్చినట్లయింది. ఏపీ పత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిధ్ధమని సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ ఉన్నారు. ఇటీవల సేవ్ ఇండియా-సేవ్ డెమోక్రసీ’ నినాదంతో ఆయన రాహుల్‌గాంధీని కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది.

మేడ్చల్ సభలో సోనియా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడంతో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుకు లైన్‌క్లియర్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సభలో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితితులపై ఆమె తల్లడిల్లారు. మీ జీవితాలు బాగుపడాలని తెలంగాణ ఇచ్చా కానీ.. మీ పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగున్నరేళ్లలో తెలంగాణ అవస్థలపాలైందని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, నాలుగున్నరేళ్లలో మీ ఆశలన్నీ ఆడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు వస్తే సొంత బిడ్డల దగ్గరకు వచ్చినట్టుగా ఉందని, తెలంగాణ ఏర్పాటు చాలా సంక్లిష్టమైన ప్రక్రియని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం చేయాలనుకున్నామని, రాజకీయంగా నష్టపోయినా మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చామని సోనియా తెలిపారు.

‘‘రైతుల ఆత్మహత్యలు నేటికి జరుగుతున్నాయి. యూపీఏ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గండి కొట్టింది. ఏ ఆకాంక్షలు నిజం చేయడానికి తెలంగాణ ఏర్పాటు చేశామో కనీసం ఆదిశగా అడుగు కూడా పడలేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక దళితులు ఆదివాసీలు అణిచివేతకు గురయ్యారు. వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? విద్యార్థులు, యువత తెలంగాణపై పెట్టుకున్న ఆశల్నీ వమ్ము అయ్యాయి. మాటపై నిలబడని, విశ్వసనీయత లేనివాళ్ల మాటలు నమ్మొద్దు. పుట్టిన బిడ్డకు సరైన పోషణ అందక పోతే భవిష్యత్‌ ఎంత దెబ్బతింటుందో తెలంగాణ నాలుగున్నరేళ్ల పాలనపై అంతే ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి విఫల పాలనకు సరైన బుద్ధి చెప్పాలి. తెలంగాణ కోసం పోరాడినట్టే మరోసారి పిడికిలి బిగించాల్సిన సమయం వచ్చింది. మీ ఒక్క ఓటు తెలంగాణ భవిష్యత్‌ మారుస్తుందని గుర్తించండి. మీ తలరాతను మార్చుకోవచ్చని తెలుసుకోండి. కాంగ్రెస్‌ కూటమికి ఓటు వేయండి, ఆకాంక్షలను నెరవేర్చుకోండి. సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన మీకు కృతజ్ఞతలు’’ అంటూ సోనియా తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here