విజయవాడ: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో కార్తీక దీపోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని నలందా విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ ఉత్సవంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 12,400 శివాలయాల్లో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామని హిందూధర్మ ప్రచార పరిషత్‌ ప్రతినిథులు పేర్కొన్నారు.

మరోవైపు, కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన కార్తీక పౌర్ణమిస్నానాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీచ్‌ఒడ్డున మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయడంతోపాటు పూజలకోసం ప్రత్యక వసతులు కల్పించారు. బస్టాండ్‌ నుంచి గురువారం మధ్యాహ్నం నుంచే ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపారు. బస్సుల సమయాలు తెలియజేయడంతోపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా బస్సులు ఎక్కించేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం పట్టణం నుంచి బీచ్‌ వరకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు.