• తెలంగాణ సభలో తెరాస లక్ష్యం

  • రాజస్థాన్‌ ప్రచారంలో కాంగ్రెస్‌పై దాడి

హైదరాబాద్, జోధ్‌పూర్‌: తెలంగాణ సహా అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారస్థాయికి చేరుకుంది. ఆయా పార్టీల పెద్దలు సంధించుకుంటున్న విమర్శలను వింటున్న వారికి అసహ్యం కలిగేలా ప్రచార సభలు సాగుతున్నాయి. కేవలం అధికారమే లక్ష్యంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ తమ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పర్యటించి సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసింగించి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అంతకముందు, రాజస్థాన్‌లో నిర్వహించిన ప్రచార సభల్లోనూ మోదీ తనదైన శైలిలో విపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ పర్యటనలో తన తెలుగు ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు మోదీ. సోమవారం ఎల్బీస్టేడియంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన తన ప్రసంగాన్ని తెలుగు పలుకులతో ప్రారంభించారు.

‘‘ఎందరో అమరవీరులు కన్న కలలు సాకారం కోసం మార్పు కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో ఆశలతో, వేలాదిగా తరలివచ్చిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక వందనం. హైదరాబాద్‌ అంటే నాకెంతో ఇష్టం. అలాగే సర్దార్‌ వల్లభాయి పటేల్‌ నాకు ఆదర్శం. పటేల్‌ పట్టుదల వల్లే హైదరాబాద్‌కు విమోచనం కల్గింది. అందుకే హైదరాబాద్‌ అనగానే నాకు పటేల్‌ గుర్తుకొస్తారు. అసలు సర్దార్‌ పటేల్‌ లేకపోయినట్టయితే ఈ స్వేచ్ఛ, తెలంగాణలో మీతో ఇలా ఆనందంగా మాట్లాడే అవకాశం నాకు కలిగేదే కాదు. హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయంగా ఖ్యాతిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు ప్రజలందరికీ నా శుభాభివందనాలు’’ అంటూ తన తెలుగు ప్రసంగాన్ని ముగించారు.

అనంతరం ఆయన హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వారసత్వం, కుటుంబ రాజకీయాలు లేని ఏకైక పార్టీ భాజపా అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని మాత్రమే తమ పార్టీ నమ్ముకుందన్నారు. రాష్ట్రంలోని ఎంఐఎం పార్టీది మరో తరహా రాజకీయమని, వారసత్వం, కుటుంబంతో పాటు మతాన్ని ఆ పార్టీ నమ్ముకుందని విమర్శించారు. తెదేపా కూడా కుటుంబం, వారసత్వ రాజకీయాలనే నమ్ముకుందని, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెదేపాను స్థాపిస్తే చంద్రబాబునాయుడు మాత్రం తన స్వార్థం కోసం కాంగ్రెస్‌తోనే కలిశారని ధ్వజమెత్తారు.

యోగ్యత లేకపోయినా వారసత్వంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో ఎందరో సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ వారసత్వ రాజకీయాల వల్ల ఎదగలేదని విమర్శించారు. ఒక కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కూడా ఒక కుటుంబం చేతిలోనే చిక్కుకుందన్నారు. డిసెంబర్‌ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలు కనుమరుగైపోతాయని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, రాజస్థాన్ పర్యటనలో మోదీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శల బాణాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాల విశ్వవిద్యాలయమని ధ్వజమెత్తారు.

అక్కడి వాళ్లు అబద్ధాలు చెప్పడంలో పీహెచ్‌డీ చేస్తున్నారని, ఎవరు బాగా అబద్ధాలు చెప్తే వారికి మంచి పదవి కూడా దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో ఒకసారి అధికారంలో ఉన్న వారు వరుసగా రెండోసారి గెలవడం లేదని, కాబట్టి ఈసారి గెలుస్తామని కాంగ్రెస్‌ భ్రమపడుతోందన్నారు. కానీ ఈ సారి మాత్రం అలా జరగని మోదీ వెల్లడించారు. రాజస్థాన్‌ సహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్న వారి కలలు కూలిపోతాయని అన్నారు. ప్రపంచానికి భూఉష్ణతాపం అంటే ఏమిటో తెలియకముందే రాజస్థాన్‌లోని బిష్ణోయి తెగ పర్యావరాణాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేసిందని మోదీ ప్రశంసించారు.

ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని, తన రిమోట్‌ కంట్రోల్‌ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. అందుకే తాను సరిగ్గా పనిచేయగలుగుతున్నానని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అసలు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ప్రజలు విద్య, విద్యుత్ తదితర సమస్యలకు పరిష్కారం కోసం ఓటు వేస్తారా.. నాకు హిందుత్వం గురించి తెలుసా, లేదా అనే విషయం ఆధారంగా ఓటు వేస్తారా అని మోదీ ప్రజలను ప్రశ్నించారు. హిందుత్వం గురించి కాంగ్రెస్‌ చేసిన విమర్శలపై ఆయన పై విధంగా స్పందించారు. రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here