• కేంద్రాన్ని ప్రశ్నించడంలో వెనుకంజ?

  • పెట్రో ధరల భారంపై నోరుమెదపని వైనం

  • సందేహాలకు తావిస్తున్న జనసేనాని అజెండా

పవన్ కల్యాణ్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. చివరికి ఆ పార్టీ శ్రేణులనే ఆయోమయానికి గురిచేసేలా ఆయన వ్యవహారశైలి, కదలికలు, మాటలూ కనిపిస్తుండడం, వినిపిస్తుండడం సగటు జనానికి కూడా అర్ధం కావడం లేదు. ప్రశ్నించడం కోసం వస్తున్నామని ప్రచారం చేసి ‘జనసేన’ పార్టీని నమోదుచేసిన పవన్ తర్వాత తన అడుగులు అధికారం వైపు మళ్లేలా చేశారు.

ఇదే చాలా మంది మదిని దోచేస్తున్న ప్రశ్న. నాటి ప్రశ్నించడం మాటను పక్కనపెట్టి అధికారం ఇస్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామంటూ పోరాట యాత్ర పేరిట జనసేనాని బస్సు యాత్ర సాగిస్తుండడం ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. మొదట్లో వెల్లువెత్తిన ప్రజా ప్రభంజనంగా అభివర్ణించిన జనసేనను సగటు ఓటరు ఆ పార్టీ వైఖరి కూడా అధికారం వైపే కదా అడుగులు? అంటూ పెదవి విరిచే పరిస్థితులు దాపురించాయి. ప్రజల భావోద్వేగాలతో ప్రతిధ్వనించే వేదికగా తన పార్టీ నిలుస్తుందని, జనం సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తామన్న పవన్ కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశాన్ని లక్షంగా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారే తప్ప సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసేలా పెట్రో ధరలు, నిత్యవసర సరకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా కనీసం కేంద్రంలోని బీజేపీ సర్కారును పల్లెత్తి మాట కూడా అనకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

బీజేపీ, జనసేన మధ్య రహస్య అజెండా ఏదో ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఏ జిల్లాకు వెళ్లిన పవన్ కల్యాణే ప్రధాన పాత్రధారి, సూత్రధారి. అనుభవం ఉన్న నాయకులెవరూ జనసేన పార్టీలో లేకపోయినప్పటికీ చేరికల్ని మాత్రం ఆయన పెద్దఎత్తునే ప్రోత్సహిస్తున్నారు. తొలి విడతగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగించిన యాత్రలోనూ ఆయన అవలంబించిన విధానం ఇదే. కాస్త విరామం ఇచ్చి మొదలుపెట్టిన రెండో విడత యాత్రలోనూ ఆయన కేవలం అధికార తెదేపాపై విమర్శలకు, చేరికలను ప్రోత్సహించడానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ చేపట్టని విధంగా పవన్ జనసేన కోసం పనికొచ్చే నేతల కోసం ఉద్యోగస్తుల్లా ఇంటర్వ్యూలు, సెలక్షన్లు నిర్వహించి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. అయితే, ఓ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు ఇది సరిపోతుందా? ఎన్నికల్లో పోటీకి, అధికారం దక్కించుకోవడానికీ ఇవి ఎంత వరకు అవసరం? అన్నదే సందేహం. పార్టీ అవతరించి చాలా రోజులు గడుస్తున్నా అసలు జనసేన ఎటువైపు అడుగులు వేస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఈ పార్టీ పెట్టి మూడేళ్లు అయినా ఇందులో అనుభవజ్ఞులు ఎవరూ కానరావడంలేదు.

ఏం చేసినా అన్నీ పవన్ పేరిటే వస్తాయి. పార్టీ వ్యవహారాలు చూడ్డానికి అని కొంతమంది తప్పా, మరెవరూ ఈ పార్టీలో లేరు. ఈ స్థితిలో ఎన్నికలకు ఇప్పటినుంచే పవన్ సిద్ధమయ్యారు. ఓ రాజకీయ పార్టీలో చేరికకు ఎంట్రన్స్ టెస్టు పెట్టిన తొలి భారతీయ రాజకీయ నాయకుడు పవన్ కల్యాణే అంటే ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మీడియాలో సబ్ ఎడిటర్లకు ఉండే లక్షణాలు ఉంటేచాలు ఈ పార్టీలో చేరిపోవచ్చు. గతంలో అన్నయ్య చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం వ్యవహారం చూసిన పవన్ గోడ దూకే నాయకుల బెడద తప్పించుకోడానికి అప్రమత్తంగా ఉన్నారని మాత్రం ఓ టాక్.

ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఓ ప్రిన్స్‌పాల్లా అందరి బయోడేటాలు పరిశీలించి పార్లీలో అవకాశం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం పెట్టిన హైటెక్ నేత కూడా ఇయనే. అయితే, ఎన్నికలు వచ్చే వరకు ఇలాగే కాలయాపన చేసి, తీరా ఎన్నికలు వచ్చేసరికి పార్టీని అన్న చేతిలో పెడతాడేమోనని కొందరి అనుమానం. లేదా లాభాన్ని ఇచ్చే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటారా? అనేది మరో అనుమానం. మొత్తం మీద పవన్ రహస్య అజెండాపై అన్ని పార్టీలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ప్ర‌జ‌ల కోసం, ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని పార్టీ పెట్టి ప్ర‌జ‌ల దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి రాజ‌కీయ ముఖ‌చిత్రంలో కీల‌కంగా మారారు.

మ‌రోసారి త‌న‌దైన శైలిలో విరుచుక‌ుప‌డే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ, ప్ర‌త్యేక హోదా కోసం రంగంలోకి దిగిన ప‌వ‌న్ కల్యాణ్ త‌న పోరాటం ఎంత‌వ‌ర‌కు సాగిస్తాడో ఏ త‌ర‌హాలో సాగిస్తాడో అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మూడు దశల్లో పోరాటం చేస్తానని పవన్‌ స్పష్టం చేశారు. మొదటి దశలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో సభలు పెడతానన్నారు. కాకినాడలోనే తొలి మీటింగ్‌ పెడతానని తెలిపారు. రెండో దశలో అన్ని పార్టీల ఎంపీలపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ రూపొందిస్తామన్నారు.

ఎంపీలు గట్టిగా పోరాడకపోతే రోడ్డుమీదకు వస్తామని హెచ్చరించారు. రాయితీలు ఇవ్వకపోతే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని, యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని కేంద్రాన్ని పవన్‌ ప్రశ్నించారు. ఏపీకి ఆర్థికలోటు ఉందని, భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తేల్చి చెప్పారు. వ్యక్తిగత సంబంధాలతో ప్రయోజనం ఉండదని, ప్రజా సమస్యలపై పోరాడక తప్పదన్నారు. ప‌వ‌న్ తాజా ఆవేశం చూస్తుంటే ఇక‌పై రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారుతాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే, ఇక్క‌డో స‌మ‌స్య ప‌వ‌న్ ఆవేశం వ‌చ్చిన‌ప్పుడే మీడియా ముందుగానీ, స‌భ‌ల్లో గానీ మాట్లాడుతారని, మిగ‌తా స‌మయాల్లో సినిమాల‌తోనే బిజీ అవుతార‌నే వాద‌న‌ కూడా ఉంది. ఎందుకంటే ప్ర‌శ్నించే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు జ‌న‌సేన ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నిస్తుంద‌ని చెబుతూ వస్తున్న ప‌వ‌న్ స‌మ‌స్య‌లు ఉన్నా లేక‌పోయినా, త‌న‌కు ఆవేశం వ‌చ్చినప్పుడే ఇలాంటి స్పీచ్‌లు ఇవ్వ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అనే వాద‌న‌లూ ఉన్నాయి. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయం అంటూ తాజాగా ప్ర‌క‌టించిన‌ ప‌వ‌న్ త‌న రాజ‌కీయ‌ పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అనే క్లారిటీ ఎవ‌రికీ ఉండ‌క‌పోవ‌చ్చు.

ఎందుకంటే రెండు గుర్రాల‌పై స్వారీ చేసే ప‌వ‌న్ ఒంట‌రిగా త‌న పార్టీని ఎలా బ‌లోపేతం చేస్తాడ‌నేదే ఇప్పుడు ఎదుర‌వుతున్న అస‌లు విష‌యం. గ్రామీణ స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను తయారు చేయ‌డం, పార్టీ సిద్ధాంతాల‌ను తయారు చేసి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం అంతా ఆషామాషి వ్య‌వ‌హారం కాదు. ఇత‌ర పార్టీల్లోంచి వ‌చ్చే సీనియ‌ర్ నేత‌లంటే ప‌వ‌న్‌కు న‌చ్చ‌దు. జ‌న‌సేన‌లోకి వ‌స్తాన‌నే అలాంటి సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌వ‌న్ రిజ‌క్ట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ బ‌రువు బాధ్య‌త‌ల‌ను చూసుకునే రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌వారెవ‌రు అనే విష‌యం ఇప్పుడు ప్ర‌ధానంగా మారింది.

2019 ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయ ముఖ‌చిత్రం మారిపోతుంద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌కంగా మారుతాడ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే, ఈ ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీని ఎంత‌వ‌ర‌కు బ‌లోపేతం చేస్తాడ‌నేది ఇప్పుడు అస‌లు విష‌యం. ఆయన తన రాజకీయ అడుగుల్ని క్రమపద్దతిలో వేయకపోతే మాత్రం గతంలో ప్రజారాజ్యం పార్టీకి లభించిన ఓట్ల శాతం కూడా రాకపోవచ్చనే విమర్శ ఉంది. ఎన్నికలకు ముందు అన్న చిరంజీవి సహా తన కుటుంబం మొత్తాన్ని పార్టీలోకి తీసుకువచ్చి ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారని, అందులో భాగంగానే పార్టీ జాతీయ స్థాయి వ్యవహారాలను పర్యవేక్షించడం, నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం వంటి కీలక బాధ్యతలను చిరంజీవికి అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏమో వర్తమానం ఎలా ఉందో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here