• తెలంగాణలో పోలింగ్ ప్రశాంతం: ఈసీ

  • ఆదిలాబాద్‌లో అత్యధికం.. హైదరాబాద్‌లో అత్యల్పం

  • 68.5 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు వెల్లడి

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం పోలింగ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా పలుచోట్ల పోలింగ్‌ కొనసాగిందన్నారు. సాంకేతిక సమస్యలు, వేర్వేరు కారణాల తీర్యా పోలింగ్ ప్రారంభానికి ఆలస్యం అయిన కేంద్రాలతో పాటు క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్ల సౌలభ్యార్ధం సమయం మించిన తర్వాత కూడా పోలింగ్‌ కొనసాగించామన్నారు.

అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 76.5 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వివరించారు. మొత్తానికి తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మరోపక్క, రాజస్థాన్‌లో 200 శాసనసభా నియోజకవర్గాలకు గానూ 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. కాగా, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెదేపా ఏజెంట్‌ను అధికారులు పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించలేదు.

తెదేపా అభ్యర్థి ఏజెంటు భానుప్రసాద్‌ సంతకం బదులుగా శ్రీనివాసరావు సంతకం చేశారని లోపలికి పంపడం కుదరదంటూ అధికారులు తొలుత అనుమతి నిరాకరించారు. దీంతో తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరానగర్ పోలింగ్‌బూత్‌లో భాజపా కార్యకర్తపై దాడి జరిగింది. నియోజకవర్గ తెరాస అభ్యర్థి దానం నాగేందర్‌ పార్టీ కండువతో ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ కండువాతో ఓటు వేయడానికి ఎలా వస్తారని భాజపా కార్యకర్త ప్రదీప్‌ ప్రశ్నించడంతో అతడిపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న భాజపా అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. శాసనసభా ఎన్నికల సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌-భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను అదుపు చేశారు. ఒక పక్క తెలంగాణ శాసనసభా ఎన్నికల జరుగుతున్న వేళ ఐమ్యాక్స్‌ థియేటర్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు.

పోలింగ్‌ నేపథ్యంలో థియేటర్‌ నిర్వాహకులు ఉదయం షో వేయలేదు. దీంతో ఈరోజు ‘2.ఓ’ సినిమా కోసం టికెట్లు పొందిన ప్రేక్షకులు థియేటర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమారం మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన స్వామి (55) శుక్రవారం ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్‌ బూత్‌లోనే ఆకస్మికంగా మృతి చెందాడు. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధుడు గుండెపోటుతో కన్నుమూశాడు. ఓటమి భయంతోనే తెరాస, భాజపా నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

కల్వకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డిపై భాజపా కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి పాతబస్తీలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ భద్రతను కట్టుదిట్టం చేసింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిఘా పెట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు చార్మినార్ నియోజకవర్గంలో 12 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా రంగాపురం తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాన్ని నేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదే విధంగా వనపర్తి జిల్లా పశ్యా తండా వాసులు సైతం ఎన్నికలను బహిష్కరించారు. తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ కొణిజేటి రోశయ్య హైదరాబాద్‌ అమీర్‌పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం అమీర్‌పేట డివిజన్‌లోని రహదారులు భవనాలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు హక్కును వినియోగించుకోవాలని అది మనందరి బాధ్యత అన్నారు. తనకు ఆరోగ్యం సహకరించకున్నా ఓటు వేశానన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రచ్చాపురంలో ఓట్లు గల్లతయ్యాయని ఓటర్లు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న భాజపా అభ్యర్థి సయ్యద్‌ షాహెజాది అక్కడకు చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గొడవ జరుగుతుందనే విషయం తెలుసుకున్న సంతోష్ నగర్ ఏసీపీ శివరామశర్మ రచ్చాపురానికి చేరుకుని ఓటర్లను శాంతింప చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు శుక్రవారం ఉదయం ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా జ్వాలా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’’ అని జ్వాలా ట్వీట్‌లో ప్రశ్నించారు. గోషామహల్‌ నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్‌లలో జరిగిన ఓటింగ్ సరళిని భాజపా అభ్యర్థి రాజా సింగ్ స్వయంగా పరిశీలించారు. నియోజకవర్గంలో చాలా ఓట్లు అక్రమంగా తొలగించారని, ఈ విషయంపై హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాజా సింగ్ తెలిపారు. మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రి ఈటల రాజేందర్‌ తండ్రి, మరో ఇద్దరు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి.

అంతేకాకుండా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన పేరు గల్లంతు కావడంతో ట్విటర్‌లో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సతీమణి రమా రాజమౌళితో పాటు అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలు ఎక్కడ చూసినా అధికార పార్టీ ఉల్లంఘనలు కొనసాగాయని మహాకూటమి నేతల బృందం ఆక్షేపించింది. కల్వకుర్తి మహాకూటమి అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై భాజపా దాడి అమానుషమని మండిపడింది. ఈ దాడి నీతిమాలిన చర్య అని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీ నేత కోదండరెడ్డి నేతృత్వంలో తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎన్.దుర్గాప్రసాద్, కాశీనాథ్, సీపీఐ నేత వెంకటరెడ్డి, తెజస నాయకులు కలిశారు. కల్వకుర్తి మహాకూటమి అభ్యర్థి వంశీచంద్‌పై భాజపా దాడిసహా ఎన్నికల్లో తెరాస అరాచకాలు, రౌడీ మూకలు ఆగడాలు సాగుతున్నాయంటూ రజత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ పాతబస్తీ యాకుత్‌పురాలో ఘర్షణ చోటు చేసుకుంది. ఎంఐఎం, ఎంబీటీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది.

రిగ్గింగ్‌ చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. తెలంగాణలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించారు. బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, సిర్పూర్‌, చెన్నూర్‌ నియోజకవర్గాల్లో ఒక గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రంలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటమి భయంతోనే తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

రోహిణ్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌లతో పాటు కల్వకుర్తిలో వంశీచంద్‌రెడ్డి పైనా, చేవెళ్లలో కేఎస్‌రత్నంపైనా దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్‌ భయపడదని చెప్పారు. దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. జియాగూడలోని 31,32 కేంద్రాల్లో సమయం దాటాక కూడా పోలింగ్‌ కొనసాగింది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు భారీగా మజ్లిస్‌, వీహెచ్‌పీ, శివసేన, భజరంగ్‌ దళ్‌ నేతలు చేరుకోవవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లో తెరాస, ఎంఐఎం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా, ఎలాంటి పక్షపాతాలకు తావు లేకుండా ఎన్నికల విధులు నిర్వహించామని రాష్ర్ట ఎన్నికల నోడల్ అధికారి, అదనపు డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. తమకు అన్ని పార్టీలు సమానమేనని, మహా కూటమి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజాకూటమి నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, చిన్నరెడ్డి ఇళ్లల్లో సోదాలు చేసినట్లు సీఈవోకు ఫిర్యాదు చేశారని, కానీ వాళ్ల గృహాల్లో ఎలాంటి తనిఖీలు చేయాలేదని చెప్పారు. మరోవైపు, ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

అయితే, కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి కటకటాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లో ఓటు వేస్తూ ఫొటో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తానికి తెలంగాణ, రాజస్థాన్‌లలో ఎన్నికల ప్రకియ ముగియడంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల క్రతువు పూర్తయినట్లయింది. నవంబరు 12, 20 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో, నవంబరు 28న మధ్యప్రదేశ్‌, మిజోరంలలో ఎన్నికలు జరగ్గా, శుక్రవారం తెలంగాణ, రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును డిసెంబరు 11న చేపట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here