• తెలంగాణ, రాజస్థాన్‌లో అన్నిచోట్లా భారీ అంచనాలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (న్యూస్‌టైమ్): అయిదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా శుక్రవారం తెలంగాణ, రాజస్థాన్‌లో పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో ఉదయం 7 గంటలకు, రాజస్థాన్‌లో 8 గంటలకు ప్రశాంత వాతావరణంలో మొదలైన ఎన్నికల పోలింగ్ చిన్నచిన్న అవాంతరాల మధ్య నిరాటంకంగా కొనసాగింది. ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠగా చూస్తున్న తెలంగాణ ఎన్నికల పోలింగ్‌‌కు ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. అదే విధంగా రాజస్థాన్‌లో కూడా పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహణకు చర్యలు తీసుకున్నారు.

సమస్యాత్మక ప్రాంతాలలో మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమయ పాలన ప్రకారం పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. తాజా ఎన్నికల్లో తెలంగాణలో 2.81 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసు, ఇతర అధికారులు కలిపి సుమారు 1.90 లక్షల మంది సిబ్బంది పోలింగు ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దు నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. దాదాపు మూడు నెలలపాటు రాజకీయ రణక్షేత్రంలో నాయకులు సాగించిన ప్రచార, వ్యూహ ప్రతివ్యూహాలను క్షుణ్నంగా గమనించిన ఓటర్లు తమ తీర్పును నమోదు చేసేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈవీఎం, వీవీపీఏటీ, ఓటర్ల జాబితా తదితర సరంజామా అంతా గురువారం సాయంత్రానికే ఆయా పోలింగు కేంద్రాలకు చేరాయి. తీవ్రవాద ప్రభావితమున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయిలో పోలీసు బలగాలను మోహరించింది. గత ఎన్నికల్లో 63 సీట్లను సాధించి అధికారాన్ని దక్కించుకుని మరోసారి దానిని నిలుపుకోవాలని చూస్తున్న తెరాసకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.

ఉప ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలతో రద్దయ్యే నాటికి శాసనసభలో తెరాస తన బలాన్ని 86కు పెంచుకుంది. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దాదాపు 3 నెలలపాటు ప్రచారం సాగించింది. నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టిన సంక్షేమ పథకాలతోపాటు మరికొన్ని కొత్త హామీలతో ప్రచారాన్ని కొనసాగించింది. ఆ పార్టీ తొలిసారిగా రాష్ట్రంలోని 119 స్థానాలకు పోటీ చేస్తోంది. తెలంగాణలో నేతల వలసలతో ఉనికి కోల్పోయిన దశ నుంచి బయటపడాలని చూస్తూ అందుకోసం ఒకప్పటి బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో తెదేపా జట్టుకట్టడం ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేక అంశం. కాంగ్రెస్‌, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ కలసి ప్రజాకూటమిగా బరిలో నిలిచాయి.

తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదనే అంశంతో పాటు రైతు రుణాల రద్దు, ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల పంపిణీ వంటి హామీలతో ప్రచారాన్ని సాగించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ 99 స్థానాలకు, తెదేపా 13 స్థానాలకు, తెజస 8, సీపీఐ 3 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. భాజపా ఈసారి 118 స్థానాలకు పోటీ చేస్తోంది. సీపీఎం సారథ్యంలోని బీఎల్‌ఎఫ్‌ 119 స్థానాలకు బరిలో నిలిచింది. ప్రధాన పార్టీల టికెట్లు ఆశించి దక్కని నేతల్లో కొంతమంది బీఎస్పీ తరఫున బరిలో నిలిచి పదికిపైగా స్థానాల్లో పోటీపడ్డారు. ఇక, రాజస్తాన్‌ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను 199 సీట్లకు శుక్రవారం పోలింగ్ జరిగింది.

ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ ఈ రెండింటిలో గెలుపెవరిదనేది ఇక్కడ ఆసక్తిదాయకంగా మారింది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 130 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఆల్వార్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. బీజేపీ నుంచి వసుంధరా రాజే తిరిగి అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ఉండగా కాంగ్రెస్‌ నుంచి అశోక్‌ గెహ్లాట్, సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్నారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 1,821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఓటు వేసే బ్యాలెట్‌ యూనిట్‌ (ఈవీఎం)లో 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే సరిపోతాయి. అందులో చివరి గుర్తు నోటా గుర్తు ఉంటుంది. 16 మందికి మించి అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఈవీఎంను అనుసంధానిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నారు. బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు బరిలో ఉన్నారు. 25 నియోజకవర్గాల్లో 15 మంది లోపు పోటీ చేస్తున్నారు. 76 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది ఉండగా, 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 కంటే ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సిద్ధిపేటలో ఓటు వేశారు.

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబంతో కలిసి సొంత గ్రామం చింతమడకలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన 374 పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. సమస్య పరిష్కారానికి గంట సమయం పట్టడంతో అనంతరం తిరిగి పోలింగ్‌ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో 7 గంటలకు అధికారులు పోలింగ్‌ ప్రారంభించలేకపోయారు.

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్‌ పోలింగ్‌ కేంద్రంలోనూ సాంకేతిక కారణాల వల్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు తహసీల్దార్‌ వనజారెడ్డితో వాగ్వాదానికి దిగారు. దాదాపు రాజకీయ ప్రముఖులందరూ ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఓటు వేశారు.

సూర్యాపేటలో మరో మంత్రి జగదీశ్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, ఎంతో ఉత్సాహం ఓటు వేయాలని ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు నిరాశ ఎదురవడంతో ఓటర్లు సహనం కోల్పోయారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పాటు, సాంకేతిక సమస్యల కారణంగా అధికారులు పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. జియాగూడ ఇందిరానగర్ లో 31, 32 పోలింగ్ కేంద్రాలు, ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్‌నగర్‌లోని సెయింట్ పాల్ స్కూల్‌లో బూత్ నంబరు 27లో, గచ్చిబౌలి హైస్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ స్టేషన్‌లలో ఈవీఎంలు మొరాయించాయి.

దీంతో ఓటర్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మల్కాజ్‌గిరి బాలికోన్నత పాఠశాల, ప్రశాంత్‌నగర్‌ ఫోబెల్‌ స్కూల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా, రాజస్తాన్‌లోని సర్థార్‌పుర నియోజకవర్గం 106వ నంబర్ బూత్‌‌లో అధికారులు తొలుత మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లను అనుమతించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here