• మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై విపరీత ప్రచారం చేయడం తగదంటూ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల దాడి పెంచారు. ‘మిస్టర్ 36కు సిగ్గు లేదు’ అని వ్యాఖ్యానించారు. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులను మరీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నట్టు అనిపిస్తోందని, మిలటరీ ఆపరేషన్ ముఖ్యమైనదే అయినా దీన్ని ఎందుకంత రాజకీయం చేస్తున్నారంటూ హుడా చేసిన వ్యాఖ్యలు రాహుల్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఉన్నాయి.

2016 సర్జికల్ దాడులను రాజకీయంగా ప్రధాని వాడుకుంటున్నారని రాహుల్ తరచు విమర్శలు చేస్తున్నారు. హుడా సైతం తాజాగా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడంతో రాహుల్ మరోసారి ప్రధానిపై ఓ ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘మన సైన్యాన్ని, సర్జికల్ దాడులను తన రాజకీయ ఆస్తిగా, అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు జేబులో వేసేందుకు రాఫెల్ డీల్‌ను వాడుకున్న మిస్టర్ 36కి కచ్చితంగా సిగ్గులేదు’’ అని రాహుల్ అభిప్రాయపడ్డారు.

సహజంగా ‘మిస్టర్ 56 ఇంచ్ చెస్ట్’ (56 అంగుళాల ఛాతీ) అంటూ మోదీని సంబోధించే రాహుల్ గాంధీ ఈసారి 36 రాఫెల్ జెట్ల లెక్కలో ‘మిస్టర్ 36’గా ప్రధానిని సంబోధించారు. మరోవైపు, సర్జికల్‌ దాడులపై లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) డీఎస్‌ హుడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. సర్జికల్‌ దాడులను రాజకీయంగా వాడుకున్నారని, అతిగా ప్రచారం చేశారని హుడా వ్యాఖ్యానించారు.

2016, సెప్టెంబర్‌ 29న భారత భద్రతా బలగాలు సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్‌ దాడులు జరిగినప్పుడు ఆర్మీ నార్త్‌ కమాండ్‌ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హుడా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు.

ఆయన నిజమైన సైనికుడిలా మాట్లాడారని ప్రశంసించారు. సర్జికల్‌ దాడులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడటం లేదని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. ‘‘నిజమైన సైనికుడిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యాన్ని సొంత ఆస్తిలా వాడుకునేందుకు మిస్టర్‌ 36 మాత్రం ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్‌ దాడులను ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. రఫేల్‌ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడి అనిల్‌ అంబానీకి రూ. 30 వేల కోట్లు లబ్ది చేకూర్చారు’’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here