• వెలుగుకు నోచుకోని ఎరుకల జీవితాలు

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే వీటి ఫలాలు ఎరుకల గిరిజనులకు ఏమాత్రం దక్కడం లేదు. గిరిజన సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇస్తామన్న ప్రభుత్వం జనాభా దామాషా ప్రకారం వారికి నిధులు మంజూరు చేయడంలేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం, దళారులు దోచుకోవడం, అనర్హులు ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాలను లబ్ధి పొందడం ద్వారా నిజమైన గిరిజనులకు, ఎరుకలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో పలువురు బోగస్‌ కులధృవీకరణ పత్రాలతో ఉన్నత విద్య చదవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. జిల్లాలో గిరిజన సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెసి సుబ్బరాయుడు ఎరుకల ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వారు తగిన చర్యలు తీసుకోలేదు.

వైహెచ్‌పిఎస్‌ బోగస్‌ ఎస్టీ ధృవపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారికి లిస్టు కూడా రూపొందించింది. బోగస్‌ ధృవపత్రాలతో పలువురు ఉద్యోగాలు పొందడంతో నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని వైహెచ్‌పిఎస్‌ నేత జె.సి.సుబ్బరాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాలలో జీవించే గిరిజనులకోసం ప్రీమెటివ్‌ ట్రైబల్‌ గ్రూపు (పిటిజి) పథకాలు, మైదానాల ప్రాంతాలలో నివసించే గిరిజనుల కోసం కొన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం వేరువేరుగా అమలుచేస్తోంది. సాధారణంగా ఎస్టీ నియోజకవర్గాల అనగా అటవీ ప్రాంతాలలో వుండే ఆదివాసులు, చెంచులు, కోయలు భావిస్తారు. కాగా మైదానంలో నివసించే ఎరుకలు లంబాడీలు, యానాది, నక్కల తదితర కులాలు ఎస్టీ జాబితా పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ట్రైబల్‌ ఏరియాగా గుర్తించింది.

అలాంటి ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. అయితే అలాంటి ప్రాంతాలు మన జిల్లాలో లేవు. నేటి హైటెక్‌ యుగంలో గిరిజన ఎరుకలు అభివృద్ధికి ఆమడదూరంలో వున్నారని చెప్పవచ్చు. గిరిజన తాండాలలో రోడ్లు, విద్యుత్‌, విద్య, వైద్యం తదితర సౌకర్యాలు లేక నమ్ముకున్న కులవృత్తులు కూడుపెట్టక ఎరుకలు అవస్థలు పడుతున్నారు. గిరిజనుల కులవృత్తులకు నేడు ఆదరణ కరువైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకలు 61375 మంది వుండగా జిల్లాలో 80వేలకు పైగా వున్నారు. రాయలసీమ ఎరుకలకు సంబంధించి 5 తెగల వారు వున్నారు.

2011 జనాభాలెక్కల ప్రకారం చెంచులు 1334, యానాదులు 2338, సుగాలీలు 20339, గిరిజనులు 16460 మొత్తం 61378 మంది వున్నట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే తమ జనాభా 90వేల మంది వున్నట్లు వైహెచ్‌పిఎస్‌ నాయకులు ఇంటింటి సర్వేచేసి పేర్కొంటున్నారు. జిల్లాలో జమ్మలమడుగు, రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, బద్వేల్‌, రాయచోటిలలో ఎరుకలు వున్నారు. లంబాడీలు సంబేపల్లె, సుండుపల్లె, వేంపల్లె, పులివెందుల, మైలవరంలలో వున్నట్లు తెలుస్తోంది.

చెంచులు అల్లూరి సీతారామనగర్‌, పాలెంపల్లె, నక్కలవారు రాయచోటి, రామాపురం, యానాదులు చిట్వేలి, రైల్వేకోడూరు, రాజంపేట, పెనగలూరు, కుక్కలదొడ్డిలో వున్నారు. జిల్లాలో ఎస్టీల జనాభా మేరకు ప్రతియేడాది కేటాయించిన బడ్జెట్‌లో నిధులు కేటాయించినా తమకు సక్రమంగా పథకాలు అందడం లేదని ఎరుకల కులస్థులు వాపోతున్నారు.గిరిజన ఉప ప్రణాళిక కింద ప్రతి శాఖ మంజూరైన నిధులను ఎస్టీ కేటగిరీకి ఖర్చుచేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆయాశాఖలు ఏమాత్రంపట్టించుకోవడం లేదు.ఎస్టీలలో పలువురు నిరక్షరాస్యులు వుండడంవలన వారికి ప్రభుత్వ పథకాలు ఎలా లబ్ధి పొందాలో తెలియడం లేదు. ఎస్టీలను చైతన్యపరచాల్సిన అవసరం వుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకలు 22లక్షల మంది వున్నారు.

అయితే వీరికి విద్య, వైద్య సౌకర్యాలు మెరుగదల కనిపించడం లేదు. వీరి జీవనవిధానం పరిశీలిస్తే కుంచలవారు యాచకవృత్తిలో జీవిస్తున్నారు.యానాదులు పాములు, ఎలుకలు పట్టడం, రైతుల పొలాల వద్ద కాపలా వుండడం జరుగుతోంది. కేవలం ఒక్క శాతం విద్యను మాత్రమే యానాదులు అభ్యసి స్తున్నట్లుతెలుస్తోంది. చెంచులు పోటు వ్యవసాయంపై జీవిస్తున్నారు. నక్కల వారు కొండప్రాంతాలలో గుడారాలు వేసుకొని ఆవులు మేపుతూ బతుకుతున్నారు.

ఎరుకలలో రెండు తెగల వారున్నారు. కుంచ ఎరుకలు పందులు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. భిక్షాటన, ఈతపొరకలు అమ్మడం తదితర పనులు చేసుకుంటున్నారు. ఇంకా దప్ప ఎరుకలు ఎదురుబుట్టలు అల్లడం వారి ప్రధాన వృ త్తి. ఇటీవల అటవీ అధికారుల నిబంధనల మేరకు అడవులలోకి వెళ్లి దబ్బలు తెచ్చుకోవడంకష్టంగా మారడంతో తమ బతుకు భారమైందని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. పందులు మేపుకునే ఎరుకలకు మెదడువాపు వ్యాధివస్తుందని, తమ జీవితం దుర్భరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఐటిడిఎ ఏర్పాటుచేయడం ద్వారా ఎరుకల గిరిజనుల అభివృద్ధి సాధ్యపడుతుందని వైహెచ్‌పిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ సుబ్బరాయుడు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాయలసీమను యూనిట్‌గా చేసుకొని ఐటిడిఏ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతంలో వున్న ఎరుకల గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు ఆస్కారంవుందన్నారు. ఐటిడిఏ ఏర్పాటు చేయాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

కడప జిల్లావారికి నెల్లూరులోని ఐటిడిఏ ద్వారా సేవలను అందిస్తున్నారన్నారు. అయితే జిల్లా వాసుల పట్ల నెల్లూరు ఐటిడిఎ అధికారులు నిర్లక్ష ధోరణి అవలంబించడంతో ఎరుకల కులస్తులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గిరిజన గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైనవిద్యనందించి వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం వుందని వైహెచ్‌పిఎస్‌ నేతలు కోరుతున్నారు. భూ పంపిణీలో ప్రభుత్వం గిరిజనులకు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అందజేయాలని జేసీ సుబ్బరాయుడు డిమాండ్‌ చేశారు.

కడప జిల్లా గిరిజనులకు నెల్లూరు జిల్లా ఐటిడిఏ ఆధిపత్యం నుంచి తప్పించి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల ఐటిడిఏ ఏర్పాటుచేయాలని,శాశ్వత గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి ఎరుకల గిరిజనులను ఆదుకోవాలని వైహెచ్‌పిఎస్‌ నేతలు కోరుతున్నారు. ఎరుకల గిరిజనుల సమస్యల పరిష్కారానికి వైహెచ్‌పిఎస్‌ ద్వారా పలుమార్లు రాస్తారోకోలు, ధర్నాలు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు జేసీ సుబ్బరాయుడు తెలిపారు.

అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఎరుకల గిరిజనులకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందజేసి, బోగస్‌ కులధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ పథకాలను, ఉద్యోగాలను పొందిన గిరిజనేతరులను శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా జిల్లాలో అగ్రవర్ణాలు ఎరుకల గిరిజనులపై చేస్తున్న దాడులపై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని జేసీ సుబ్బరాయుడు డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here