• సాంకేతిక ప్రగతికి సహకరించాలని పిలుపు

  • గ్రంధాలయ సంస్థ తొలి సమావేశంలో నిర్ణయం

ఒంగోలు, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): జిల్లాలో గ్రంధాలయాల అభివీద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ యలగాల వెంకట సుబ్బారావు తెలిపారు. గురువారం స్థానిక జిల్లా గ్రంధాలయంలో ఆయన పాలకవర్గం సభ్యులు, అధికారులతో తొలి సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారని, ఈ నమ్మకాన్ని వమ్ముచేయకుండా జిల్లాలోని అన్ని గ్రంధాలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. జిల్లాలో 65 గ్రంధాలయాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయని, వీటితో పాటు పది గ్రామీణ గ్రంధాలయాలు, ఒక జిల్లా గ్రంధాలయంతో పాటు 45 బుక్ డిపాజిట్ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఇవన్నీ పాఠకులకు చేరువ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంధాలయ సంస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసి అవసరమైన పరికరాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్ సహకారంతో గ్రంధాలయ సంస్థను ఆర్ధికపరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. జిల్లాలోని వ్యాపారులు, ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలూ గ్రంధాలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి పోలిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కేఎస్ సుబ్బారావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here