న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ఈ అంశంపై గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్‌ నివేదిక చెప్పిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇప్పటికీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము, నిల్వలకు సంబంధించిన వివరాలు అందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో ఆరోపించింది.

ముడి ఇనుము లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు తీసుకుంటోందని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌పై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని వెల్లడించింది. టాస్క్‌ఫోర్స్‌ ద్వారా కర్మాగార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఈ నెల 17న టాస్క్‌ఫోర్స్‌ సమావేశం జరిగిందని, టాస్క్‌ఫోర్స్‌ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంది. అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, వారు కేంద్రంతో సహకరించనందువల్లే మెకాన్‌ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వివరించింది.

ఏపీ సమాచారం ఇవ్వగానే మెకాన్‌ సంస్థ స్టీల్‌ ప్లాంట్‌పై తుది నివేదిక ఇస్తుందని, పెట్టుబడులకు ఉన్న మార్గాలను కూడా మెకాన్‌ సంస్థే సూచిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక, స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని పేర్కొంది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ ఏపీ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని, వారితో పాటు భాగస్వాములతోనూ చర్చలు కొనసాగిస్తున్నారని కేంద్రం స్పష్టంచేసింది. టాస్క్‌ఫోర్స్‌ నివేదికలో పొందుపర్చే అంశాలపైనా బీరేంద్రసింగ్‌ చర్చిస్తున్నారని పేర్కొంది.

స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే మెకాన్‌ నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్రం వెల్లడించింది. మరోవైపు, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొని కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం భుజాలకు ఎత్తుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రూ.20వేల కోట్ల వ్యయంతో సుమారు 3వేల ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించనున్నారు. మూడు నెలల్లోగా పనులు ప్రారంభించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here