ఏలూరు, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): జిల్లాలో జ్ఞానభూమి కింద వివిధ విద్యా సంస్థల్లో పాత, కొత్త 1976 మంది విద్యార్ధుల బయోమెట్రిక్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి కాలేదని వచ్చే వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే సంబంధిత అధికారుల జీతాలు నిలుపుదల చేయబడతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో గురువారం జ్ఞానభూమి, వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతి తీరును సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నప్పటికి జిల్లాలో పాత, కొత్త విద్యార్ధుల బయోమెట్రిక్‌ గుర్తింపులో ఇంకా 1976 మంది విద్యార్ధుల బయోమెట్రిక్‌ గుర్తింపు పూర్తికాకపోవడానికి కారణమేమిటని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. అదే విధంగా ఆయా కళాశాలల ప్రినిపల్స్‌ ద్వారా 603 మంది పిల్లల ఒన్‌టైమ్‌ ఆథాంటికేషన్‌ పూర్తి చేయవల్సి ఉందన్నారు. ఈ విషయంలో నన్నయ్య యూనివర్శిటీ, ఆర్‌ఐఓ పరిధిలోనే 70శాతం పెండింగ్‌లో ఉందన్నారు.

జిల్లాలో ఉపకార వేతనాలకింద 2017-18 సంవత్సరం వరకు గతంలో విద్యార్ధులకు మంజూరు కాబడి వారి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ కాకుండా వున్న కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు వారిపేరుతో అమల్లో వున్న బ్యాంకు ఎకౌంట్‌ ఖాతా పుస్తకాన్ని తీసుకొని ఎస్‌సి, బిసి, ఎస్‌టి, మైనార్టీస్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖాధికారులను గాని, ఏలూరు జిల్లా ఖజానా కార్యాలయంలోగాని సంప్రదించేలా ఆయా కళాశాలల ప్రినిపల్స్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

ఎవరైతే విద్యార్ధులకు సంబంధిత డబ్బు పడలేదో వారు తమ బ్యాంకు ఎకౌంట్‌ ఖాతా పుస్తకాన్ని ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత అధికారులను కలిసి వారి వ్యక్తిగత ఖాతాను సరిచేసుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీ దాటిన ఎడల ఈ అవకాశం ఉండదని ఇదే ఆఖరి అవకాశం అని అన్నారు. ఈ దృష్ట్యా సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌ తగు చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం జిల్లాలో ఎస్‌సి, బిసి సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ఆయా కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న పధకాల ప్రగతి తీరును కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో సాంఘీక సంక్షేమశాఖ డిడి రంగలక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here