• పురుషులతో సమానంగా అవకాశాలని వెల్లడి

ఏలూరు, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): మహిళలు క్రీడల్లో రాణించడానికి పాఠశాల స్థాయి నుండే మంచి శిక్షణ పొందాలని ఎమ్‌ఎల్‌సి రాము సూర్యారావు చెప్పారు. స్థానిక సురేష్‌ భహుగుణ పోలీస్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో గురువారం బడేటి శ్రీహరిరావు మెమోరియల్‌ కప్‌ ఆధ్వర్యంలో 4వ ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల మహిళా హ్యాండ్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను ఆయన ప్రారంబించారు.

సమాజంలో అనాది నుండి మహిళలను నిర్లక్ష్యం చేయడం వలన నేడు అన్ని రంగాలలో మహిళల ప్రగతి సాధ్యపడలేదని గత దశాబ్ధం నుండి మహిళలకు అన్ని రంగాలలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో మహిళలు తమ సత్తాను చాటుతున్నారని సూర్యారావు చెప్పారు. వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలలో కర్నం మల్లీశ్వరి, పరుగులో పిటి ఉష, షెటిల్‌బ్యాట్‌మెంట్‌లో సానియామీర్జా, సైనా నెహ్వాల్‌, కోనేరు హంపి, సింధూ అంతర్జాతీయ కీర్తిని ఆర్జించారని అదే బాటలో హ్యాండ్‌బాల్‌లో కూడా ప్రావిణ్యత సాధించాలని సూర్యారావు కోరారు. తొలుత క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

బడేటి శ్రీహరిరావు చార్టబుల్‌ట్రస్ట్‌ కార్యదర్శి ఎస్వీ రంగారావు, రిజర్వ్‌ పోలీస్‌ అడిషనల్‌ ఎస్పీ ఎమ్‌ మహేష్‌కుమార్‌, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ రిఫరీ బడేటి వెంకటరామయ్య, కార్పొరేటర్‌ బండారు కిరణ్‌ కుమార్‌, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.