• ‘కడప ఉక్కు’ వైకాపాకు ఇష్టం లేదని వ్యాఖ్య

  • ఏపీ శక్తి ఏంటో కేంద్రానికి తెలిసేలా నిర్మిస్తామని వెల్లడి

  • ‘రాయలసీమ ఉక్కు’ శంకుస్థాపన సభలో చంద్రబాబు

కడప, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. కడపలో గురువారం నిర్వహించిన రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ (ఆర్ఎస్‌పీ) నిర్మాణ పనుల శంకుస్థాపన సభలో సీఎం అటు కేంద్రంపైన, ఇటు జగన్‌పైనా విరుచుకుపడ్డారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటవుతుండడం జగన్‌కు ఇష్టం లేనట్లుందని వ్యాఖ్యానించారు. ఈ ఫ్యాక్టరీతో రాయలసీమ చరిత్ర పూర్తిగా మారుతుందని చంద్రబాబు అన్నారు. ఈ నిర్మాణాన్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

తెలుగు వారి శక్తి ఏంటో కేంద్రానికి తెలియజెప్పేలా ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఢిల్లీ వెళ్లి పోరాటం చేసినా కేంద్రం కనికరించలేదన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడంతో 60 రోజుల అల్టిమేటం ఇచ్చామని, ఆలోపు ముందుకు రావాలని కేంద్రాన్ని కోరామన్నారు. అప్పటికీ స్పందించపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను తీసుకుందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రంపై పోరాడుతుంటే తెదేపా నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

కేంద్రం మనల్ని బానిసలుగా పన్నులు కట్టే యంత్రాలుగా మాత్రమే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకులు ఉక్కు పరిశ్రమపై పోరాడకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారని పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిశ్రమ ఏర్పాటుకు వైకాపా అధినేత జగన్‌ ఏనాడైనా ప్రయత్నం చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం 12 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తే తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారని, రూ.30వేల కోట్ల విలువైన ఐరన్‌ ఓర్‌ను దోచుకున్నారని ఆయన విమర్శించారు. జగన్‌ వంటి నేతలకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఇష్టం లేదన్నారు.

ఉక్కు పరిశ్రమతో ఇక్కడి భూములకు విలువ పెరిగి రైతులు ఆనందంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదా అని సీఎం ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నామని చంద్రబాబు చెప్పారు. నెలలోపు ఉక్కుపరిశ్రమ భూసేకరణ పూర్తి చేసి, 3 నెలల్లో పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించానని తెలిపారు. కుప్పం కంటే పులివెందులకు నీళ్లిస్తానని చెప్పానని, చిత్రావతి ద్వారా నీళ్లిచ్చామన్నారు. రాబోయే రెండేళ్లలో గోదావరి నీళ్లు పెన్నాకు రానున్నాయని సీఎం చెప్పారు. రాయలసీమను పరిశ్రమల గడ్డగా తయారు చేసే బాధ్యత తనదని, కడప ఉక్కు పరిశ్రమతో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ సిటీని ఏర్పాటు చేస్తామని, గండికోటను పర్యాటక కేంద్రంగా తయారు చేసే అవకాశముందని చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామని చంద్రబాబు వివరించారు. ప్రపంచంలోనే సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే అన్నారు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమని చెప్పారు. సంపద సృష్టించాలని, అదంతా పేదలకు దక్కాలని సీఎం ఆకాంక్షించారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాల్సిన అవసరముందని చెప్పారు.