• తెలంగాణ సీజేగా రాధాకృష్ణన్‌ కొనసాగింపు

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. జనవరి 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రాధాకృష్ణన్‌ తెలంగాణ సీజేగా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల కేటాయింపు జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ఎవరనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. కాగా, ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపీకి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ఏపీకి కేటాయించిన వారిలో జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. వారందరిలో సీనియర్‌గా ఉన్న ఉన్న నేపథ్యంలో జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా ఉత్తర్వులతో ఏపీలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు సేవలందించనున్నారు. మరోవైపు, ఉమ్మడి హైకోర్టు విభజన నిర్ణయంపై తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేయగా ఆంధ్రా న్యాయవాదులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి హైకోర్టును హడావిడిగా విభజించి అమరావతి వెళ్లిపోమ్మంటే ఎలా అంటూ ఏపీ న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో ఎలాంటి వసతులు లేవని, తగిన సమయం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అని హైకోర్టు ఆవరణలో వాళ్లు ఆందోళన చేశారు. దీంతో ఛీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్ బెంచ్ దిగి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఛీఫ్ జస్టీస్ రాధాకృష్ణన్ ఏపీ న్యాయవాదులను తన ఛాంబర్‌కి పిలిపించి మాట్లాడారు.

ఏపీలో కొత్త భవనం సిద్దం కాలేదని, ఇంకా ఉమ్మడి కేసులపై స్పష్టత లేదని, సిబ్బంది, ఫైళ్ల విభజన కూడా పూర్తి కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్లమంటారని న్యాయవాదులు చీఫ్ జస్టీస్‌ను ప్రశ్నించారు. అమరావతిలో కొత్త హైకోర్టు భవనం పూర్తయి అందుబాటులోకి రావాలంటే ఇంకో రెండు నెలల సమయం పైగానే పడుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని హైకోర్టుగా ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తూ ఈ సమాచారాన్ని ఇప్పటికే హైకోర్టు వర్గాలకు చెప్పింది.

ఒక వేళ అమరావతికి తరలిరావడం కష్టమైతే రెండు నెలల పాటు హైదరాబాద్‌లోనే ఏపీ హైకోర్టును కొనసాగించాలని అనుకుంటోంది. అయితే రాష్ట్రపతి గెజిట్‌లో ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంపైనే కొనసాగించాలనే నిబంధన ఉంది. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం వల్ల ఆ నిబంధన అడ్డు వచ్చే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here