కార్మోరాంట్‌ ఫిషింగ్‌ అనగా ఒక సాంప్రదాయక చేపలు పట్టే పద్ధతి, ఈ పద్ధతిలో మత్స్యకారులు కార్మోరాంట్‌ పక్షులకు చేపలు పట్టి తెచ్చే శిక్షణనిచ్చి వాటిని నదులలో చేపలు పట్టేందుకు ఉపయోగిస్తారు. ఈ చేపలు పట్టే విధానాన్ని ఉకాయ్‌ అని కూడా అంటారు. చారిత్రాత్మకంగా, సుమారు క్రీ.శ.960 నుండి జపాన్‌, చైనాలలో కార్మోరాంట్‌ ఫిషింగ్‌ జరిగేది. క్రీ.శ.636లో పూర్తయిన చైనా సుయ్‌ రాజవంశం అధికారిక చరిత్ర అయిన బుక్‌ ఆఫ్‌ సుయిలో పురాతన జపనీస్‌ చే ఈ పద్ధతి ఉపయోగించబడినదని వర్ణించబడింది.

ఈ టెక్నిక్‌ ఇతర దేశాల్లో కూడా ఉపయోగించారు, కానీ చైనాలో ఈ సాంప్రదాయం అంతరించే దశలో ఉన్నది. కార్మొరాంట్‌లకు చేపలంటే బాగా ఇష్టం, చేపలను వేటాడి పట్టుకు తినడంలో ఇవి మంచి నేర్పరితనం కలవి. జాలరులు తాడువంటి దానిని కార్మొరాంట్‌ల మెడకు ఉచ్చులాగా బిగించి నీళ్లలో వదులుతారు. అప్పుడు నీటిలో చేపను పట్టి మింగబోయిన కార్మొరాంట్‌కు ఉచ్చు అడ్డుపడటం వలన మింగలేక పోతుంది. కార్మోరాంట్‌ గొంతుకు అడ్డుపడిన చేపలను మత్స్యకారుడు తీసుకుంటాడు. కార్మోరాంట్‌ ఫిషింగ్‌ పద్ధతి జపాన్‌లో జిపూ సిటీలోని నగారా నదిలో నేటికి పాటిస్తున్నారు.

ఈ పద్ధతిలో చేపలు పట్టడం కష్టమైనప్పటికి, లాభం రాకపోయినప్పటికి సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు, అందుకు జపాన్‌ ప్రభుత్వం కూడా తన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఈ ఉకాయ్‌ చేపల వేటను చూసేందుకు పర్యాటకులు జిపూసిటీకి తరలివస్తుంటారు.