న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఏపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వినోద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైఎస్సార్‌సీపీయేనని తెలిపారు. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, బంద్‌లు చేపట్టామని, పార్లమెంటులోపలా, బయటా పోరాటం చేశామని చెప్పారు.

హోదా కోసం ఎన్‌డీయే ప్రభుత్వంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేశామని అన్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్మ పోరాట దీక్షలతో చంద్రబాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

మొదటి నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీయే ముద్దు అని మొదట ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నయవంచకుడని తూర్పారబట్టారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టారని అన్నారు. హోదా వచ్చుంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నయవంచనను ప్రజల గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కచ్చితంగా 25 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా సాధించేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను నెరవేరుస్తుందని భావిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన ‘వంచనపై గర్జన’లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు నెరవేర్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ధర్మపోరాట దీక్షలతో మరో డ్రామాకు సీఎం చంద్రబాబు తెర తీశారని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని దుయ్యబట్టారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి హోదా ఆవశ్యకతను చాటిచెప్పడంతో ఈ అంశం ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించి ధర్మాపోరాట దీక్షలతో మరోసారి వంచించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం, ప్రత్యేక హోదా కోసం నాలుగన్నరేళ్లుగా చిత్తశుద్ధితో వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందన్నారు. దమ్మున్న నాయకుడు అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి తన సొంత ప్రయోజనాలు నెరవేరలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేశారని వైఎస్సార్‌సీపీ నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో భయపడి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రజలను వంచించింది ముమ్మాటికీ చంద్రబాబేనని నొక్కివక్కానించి చెప్పారు. ఎన్నోసార్లు మోదీని పొగుడుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని పేర్కొన్నారు. ఏపీకి అన్యాయం చేసిన విషయంలో వెంకయ్యనాయుడు పాత్ర ఉందని అన్నారు. ఏపీకి మొదటి శత్రువు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి వల్ల ఏపీకి రూ. లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని అన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టులను తన అనుచరులకు ఇచ్చి చంద్రబాబు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌ను ఒక బ్రోకర్‌లా చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. హోదాపై యూటర్న్‌ తీసుకుని హోదా నేనే తెస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ తీసుకురాకుండా బీజేపీని చంద్రబాబు తిడుతున్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీతో చంద్రబాబు కలిసిపోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు.

ఎన్నికలైన తర్వాత చంద్రబాబు ఏంటో కాంగ్రెస్‌ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రధాని మోదీతో లాలూచీ పడ్డారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. అప్పుడు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆర్థికమంత్రి జైట్లీకి సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడితే పీడీ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరి హోదా సాధించని చంద్రబాబుపై ఎలాంటి కేసులు పెట్టాలని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్‌సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన నేతలను తన పార్టీలోకి తీసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోద ప్రకటించాలని మోదీని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేత, నటుడు పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ తెలంగాణలో మహాకూటమి అనేది సిగ్గుమాలిన, అనైతిక కలయిక అని అభివర్ణించారు.

ప్రజలు చంద్రబాబును తెలంగాణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాజన్న రాజ్యం, సంక్షేమ రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం కావాడాన్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి గమ్యం లేదని ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు సంక్రాంతికి హరిదాసుల్లా వచ్చి ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కలవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.