• బాక్సింగ్‌ డే టెస్టులో రెండో రోజూ బ్యాట్స్‌మెన్‌దే!

మెల్‌బోర్న్‌, డిసెంబర్ 27: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. రెండో రోజు మ్యాచ్‌లో పుజారా శతకంతో రాణించగా కోహ్లీ, రోహిత్‌ శర్మ అర్ధ శతకం చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 443/7 వద్ద డిక్లేర్‌ చేసింది. 215/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ ప్రారంభించిన కోహ్లీసేన రెండో రోజు 228 పరుగులను జోడిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో పాట్‌ కమిన్స్‌కు మూడు వికెట్లు, మిచెల్ స్టార్క్‌కు రెండు, హేజిల్‌వుడ్‌, నాథన్‌ లైయన్‌ చెరో వికెట్‌ దక్కాయి. రెండో రోజు గురువారం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మ్యాచ్‌ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కోహ్లీ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న పుజారాతో కలిసి చెలరేగి ఆడాడు. ఈ జోడీ చాలాసేపటి వరకు పైన్‌ సేనకు ముచ్చెమటలు పట్టించింది. కోహ్లీ మూడుసార్లు స్టార్క్‌కు చిక్కబోయి తప్పించుకున్నాడు.

అయితే నాలుగో సారి మాత్రం స్టార్క్‌ మార్క్‌ పనిచేసింది. 122వ ఓవర్లో స్టార్క్ వేసిన బంతిని ఫించ్‌ చేతికిచ్చి కోహ్లీ పెవిలియన్‌ చేరాడు. బంతిని భారీ షాట్‌గా మలచాలనుకునే ప్రయత్నంలో ఔటయ్యాడు. దీంతో టెస్టు కెరీర్‌లో మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకోవాలన్న కోహ్లీ కల చెదిరింది. తొలి రోజు నుంచి ఆసీస్‌ బౌలర్లను పరుగులు పెట్టిస్తున్న కోహ్లీ-పుజారా జోడీని స్టార్క్‌ విడదీశాడు.

వీరిద్దరూ మూడో వికెట్‌ నష్టానికి 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ తర్వాత మ్యాచ్‌ అంటే పుజారాదే. నిన్నటి నుంచి క్రీజులో నిలదొక్కుకుని ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొన్న పుజారా తన టెస్టు కెరీర్‌లో 17వ శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతున్నప్పటికీ పుజారా మాత్రం ఏ మాత్రం చెదరకుండా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. రెండోరోజు మ్యాచ్‌లో లైయన్‌ వేసిన 113వ ఓవర్‌ మొదటి బంతిని అద్భుతమైన ఫోర్‌గా మలచడంతో పుజారా 281 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేశాడు. శతకం పూర్తి చేసుకున్న పుజారాను కమిన్స్‌ ఔట్ చేశాడు. 125వ ఓవర్లో కమిన్స్‌ వేసిన బంతికి పుజారా (106; 10×4) బౌల్డ్‌ అయ్యాడు.

మరోవైపు, గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమై మూడో టెస్టులో స్థానం కల్పించుకున్న రోహిత్‌ శర్మ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో ఎండ్‌లో ఉన్న రహానె తోడుగా రోహిత్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తొలుత చాలా సేపటి వరకు ఖాతా తెరవని రోహిత్‌ రహానెకు తోడుగా నిలిచాడు. జోరు మీదున్న రహానె మాత్రం 34 పరుగుల వ్యక్తి గత స్కోర్‌ వద్ద 148వ ఓవర్లో లైయన్‌ వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా 152 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది.

ఇక రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ మొదట్లో ఆచితూచి ఆడాడు. తర్వాత రోహిత్‌ శర్మ తోడుగా జోరు పెంచి భారీషాట్లు ఆడాడు. అయితే, 169 ఓవర్లో స్టార్క్ వేసిన బంతిని పంత్‌(39) భారీ షాట్‌గా మలచబోయి ఖవాజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా తొలి బంతికే ఫోర్‌ బాది మెరుపులు మెరిపించాడు. 169 ఓవర్లో హేజిల్‌వుడ్‌ వేసిన బంతి జడేజా(4) గ్లౌజును తాకి పైన్‌ చేతికి చిక్కింది. దీంతో 443/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తున్నట్లు టీమిండియా సారథి అనూహ్యంగా ప్రకటించాడు. కాగా, టీమిండియా 443/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసిన అనంతరం పైన్ సేన తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఆరు ఓవర్లలో 8 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్‌(3; బ్యాటింగ్‌), మార్కస్‌ హారిస్‌(5; బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

మరోవైపు, టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక అర్ధ సెంచరీలను సెంచరీలుగా మలిచిన టీమిండియా నం.3 బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర లిఖించాడు. మూడో స్థానంలో పుజారా ఇప్పటికి 10 అర్ధసెంచరీలను శతకాలనుగా మార్చాడు. 2018లో అత్యధికంగా ఏడు అర్ధశతకాలు చేశాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచ బ్యాట్స్‌మెన్‌లో పుజారా మూడోస్థానంలో నిలవగా, టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఇక మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పుజారా శతకం చేసిన విషయం తెలిసిందే. తన టెస్టు కెరీర్‌లో 17 శతకాన్ని నమోదు చేసుకున్న పుజారాకిది ఈ సిరీస్‌లో రెండో శతకం. దీంతో సహా ఈ ఏడాది మూడు శతకాలు నమోదు చేశాడు.

ఆసీస్‌ జట్టుపై ఇది పుజారాకు నాలుగో శతకం. ఎంసీజీ కాకుండా మరో పిచ్‌ అయితే వేగంగా పరుగులు చేసేవాడినని ఈ సందర్భంగా పుజారా అన్నాడు. సమయం పెరుగుతున్నా కొద్ది వికెట్‌ తన స్వభావం మార్చుకుంటోందని వెల్లడించాడు. ‘‘పరిస్థితిని బట్టి పిచ్‌ స్వభావాన్ని అనుసరించి బ్యాటింగ్‌ చేయాలి. ఈ పిచ్‌పై పరుగులు చేయాలంటే ప్రతి బ్యాట్స్‌మన్‌ ఎక్కువ బంతులు ఆడాలి. మరో వికెటైతే నేను 140-150 పరుగులు చేసేవాడిని. టెస్టు క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌ను, పరిస్థితిని అధ్యయనం చేసి ఆడాలి’’ అని పుజారా పేర్కొన్నాడు. ‘‘పిచ్‌పై పరుగులు చేయడం కష్టంగా ఉంది.

తొలి రెండు రోజుల్లో చేసిన పరుగులు చాలా తక్కువ. ఒక రోజులో 200 చేయడం కష్టమైన పని. ఈ ప్రకారం మేం భారీ స్కోరు చేసినట్టే. పిచ్‌ క్రమంగా జీవం కోల్పోతోంది. అసహజంగా బౌన్స్‌ అవుతోంది. నిన్నటికి, ఈ రోజుకే భారీ తేడా కనిపించింది. మూడో రోజు నుంచి బ్యాటింగ్‌ చేయడం ఎంతో కష్టం. మా బౌలర్లు అద్భుతంగా బంతులు వేస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటింగ్‌ చేసేటప్పుడు కచ్చితంగా ఇబ్బంది పడుతుంది.

పిచ్‌ వేగాన్నీ తట్టుకోలేకపోయా. నాలుగైదు బంతులు చేతి వేళ్లను తాకాయి. అవి షార్ట్‌పిచ్‌ బంతులూ కావు. తక్కువ బౌన్స్‌తో ఇబ్బంది లేదు. బౌన్స్‌లో వైవిధ్యం ఉంటే మాత్రం ఏం చేయలేం. కమిన్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వైవిధ్యంగా బౌన్స్‌ చేశాడు’’ అని పుజారా అన్నాడు. శతకం సాధించిన పుజారా మ్యాచ్‌లో విరాట్‌ (82)తో కలిసి 170 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. కాగా, రికార్డుల రారాజు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ టెస్టు కెరీర్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఒక ఏడాది కాలంలో విదేశీ గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరుమీద ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. అనంతరం దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేశాడు. ద్రవిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు చేశారు.

ఇక టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలురాయినీ అందుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు కంగారూ జట్టు మీదనే చేశాడు. ఆసీస్‌ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీకి శతకం చేజారింది. తొలి రోజు నుంచి క్రీజులో కుదురుకుని ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకున్న కోహ్లీ 82 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. అయితే, తాము ఊహించిన దానికన్నా త్వరగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ పిచ్‌ క్షీణిస్తోందని ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా పరుగులు చేసినప్పటికీ మూడు ఫలితాలు వచ్చే అవకాశముందని పేర్కొన్నాడు. రెండో రోజు మరో 25 నిమిషాల ఆట మిగిలివుండగా 443/7 వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. ఆసీస్‌ 8/0తో నిలిచింది. ‘‘స్లిప్‌లో ముగ్గురు ఫీల్డర్లు, గల్లీలో ఒకర్ని పెట్టే సంప్రదాయ ఆస్ట్రేలియా పిచ్‌లా మెల్‌బోర్న్‌ వికెట్‌ లేదు. పెర్త్‌ తరహాలో బంతి సీమ్‌ అయింది. ఇలాంటి పిచ్‌లపై ప్రణాళికకు కట్టుబడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. మేం ఊహించిన దానికన్నా ముందుగానే పిచ్‌ క్షీణిస్తోంది.

ఈ రాత్రి మరింత పాడవుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో మేం టీమిండియాను ఒత్తిడిలోకి నెడితే మేం గెలవొచ్చు. వందశాతం మూడు ఫలితాలకు ఆస్కారముంది. అవి భారత్‌ గెలుపు, ఆసీస్‌ గెలుపు, డ్రా’’ అని ఫించ్‌ అన్నాడు. ఆసీస్‌ బౌలింగ్‌ దాడిని ఫించ్‌ ప్రశంసించాడు. ఆరు సెషన్ల పాటు అద్భుతంగా బంతులు విసిరారన్నాడు. కమిన్స్‌ ఒక ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లు వేసి నైట్‌వాచ్‌మన్‌గా వెళ్లేందుకు ప్యాడ్లు కట్టుకోవడం ఎంతో ధైర్యంతో చేసిన పనిగా పేర్కొన్నాడు. టీమిండియా రెండో రోజు ఆట చివర్లో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం ఊహించిందేనని ఫించ్‌ అన్నాడు.

‘‘కోహ్లీ, పుజారా ఔటైన తర్వాత వారి ప్రణాళికలు మారయని అనుకుంటున్నా. 300/5 ఉన్నప్పుడు మాకు అవకాశం ఉందని భావించాం. కానీ టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అద్భుతంగా ఆడారు. ఆట మళ్లీ పుంజుకుంది. మేం రెండు రోజుల ఫీల్డింగ్‌ చేయడంతో కోహ్లీసేన కచ్చితంగా డిక్లేర్‌ చేస్తుందనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ జట్టైనా ఇలాగే చేస్తుంది’’ అని ఫించ్‌ అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here