• జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి

విజయనగరం, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): విద్యార్థులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి బయటకు తీస్తే వారు అద్భుతాలు సాధిస్తారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతి రాణి పేర్కొన్నారు. గురువారం బొండపల్లి మండలం గొట్లం గాయత్రి టెక్నో పాటశాలలో రెండు రోజుల పాటు జరుగనున్న 46వ జవహర్ లాల్ నెహ్రూ జాతీయ వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన (జే.ఎన్.ఎన్.ఎం.ఇ.ఇ) ను అతిదులతో కలసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభింవచారు.

ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత నాలుగన్నరేల్లలో జిల్లా సాధించిన ప్రగతి ఏ జిల్లాకు తీసిపోదని స్పష్టం చేసారు. విద్యార్దినులకు 10 వేల సైకిళ్ళు, స్టడీ మెటీరియల్ అందించామని గుర్తు చేసారు. అదేవిధంగా ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టినంతనే ప్రైవేటు పాటశాలలలో చదువుతున్న ఆరు వేల మంది విద్యార్ధినీ విద్యార్ధులు ప్రైవేటు చదువు మానేసి ప్రభుత్వ పాటశాలల్లో ప్రవేశం పొందారని తెలిపారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాటశాలల్లోనే మెరుగైన వసతులు, విద్యా బోధనా జరుగుతాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పిల్లలు ఇష్టంతో చదివితే చదివింది గుర్తుంటుందని హితబోధ చేసారు.

విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు కుంగిపోకుండా స్ఫూర్తిగా తీసుకొని మరింత పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం తధ్యమని తెలిపారు. విద్యార్ధులు ఎట్టి పరిస్థితులలోనూ మనో ధైర్యం కోల్పోకుండా భవిష్యత్ పట్ల దృష్టి సారించాలని,ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలని, చురుకుగా ఉండాలని, ఏ రంగాన్ని ఎంచుకున్న అందులో ది బెస్ట్‌గా నిలవాలని ఆకాంక్షించారు. స్థానిక గజపతినగరం శాసన సభ్యులు డాక్టర్ కె.ఎ.నాయుడు మాట్లాడుతూ గజపతి నగరం నియోజక వర్గాన్ని ఒక విద్యా హబ్‌గా తీర్చిదిద్దటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాటశాలలలో నమోదు పెరుగుతోందని, భవిష్యత్తు ఆధారంగా పిల్లల ఆలోచనలలో మార్పు రావాలని సూచించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాటశాలల నుండి ప్రదర్శించిన సుమారు 200ప్రదర్శనలను ఆహుతులు తిలకించారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు గాదె శ్రీనివాసులు నాయుడు, జిల్లా విద్యా శాఖాధికారి జి. నాగమణి, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు, గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ జగదీశ్వరి, జెడ్.పి.టి.సిలు బాలాజీ, రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here