వ్యాపారాన్ని పెంచుకునేందుకు వాణిజ్యవర్గాలు వేయరాని ఎత్తులంటూ ఉండవు. ఆకర్షణీయమైన ఆఫర్లకు తోడు ఆకట్టుకునేలా ఫైనాన్స్ సదుపాయాన్నీ కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. పండుగ సీజన్‌లో షాపింగ్ మంచి ఊపులో ఉంటుంది. ఆన్‌లైన్ రీటెయిలర్లు, ఆఫ్‌లైన్ అమ్మకందారులు ప్రకటించే డీల్స్‌లో కొనుగోళ్లు చేసేందుకు నోకాస్ట్ ఈఎంఐ లేదా జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఇస్తున్నామని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తెగ ఊరిస్తున్నాయి. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (ఈఎంఐ)తో ఒకేసారి భారీ మొత్తం చెల్లించాల్సిన భారం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

కానీ నో కాస్ట్ ఈఎంఐ అంటే నిజంగానే దానిపై అదనంగా ఎలాంటి వడ్డీ పడదనే అపోహలో ఉండొద్దు. అసలు జీరో కాస్ట్ ఈఎంఐపై ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలిస్తే కళ్లు తిరుగుతాయి. వాస్తవంలో మీరు నో కాస్ట్ ఈఎంఐపై 16-24% వరకు అధిక వడ్డీరేటు పడుతుందనేది నమ్మలేని నిజం. ఏ రుణం వడ్డీ లేనిది కాదని 2013లో విడుదల చేసిన ఓ సర్కులర్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టంగా పేర్కొంది. ‘‘సాధారణంగా క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన మొత్తాలపై జీరో పర్సెంట్ ఈఎంఐ పథకంలో వడ్డీ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీ రూపంలో వసూలు చేసుకుంటాయి.

అదే విధంగా కొన్ని బ్యాంకులు రుణంపై వడ్డీని ప్రొడక్ట్ నుంచి వసూలు చేస్తున్నాయి. ఎందుకంటే అసలు జీరో పర్సెంట్ ఇంట్రస్ట్ అనేదే లేదు. అందుకని ఇందులో పారదర్శక పద్ధతి ఏంటంటే ప్రాసెసింగ్ చార్జీలు, వడ్డీని ప్రోడక్ట్/సెగ్మెంట్ అనుసారంగా ఉంచాలి. అంతే తప్ప రుణాలు ఇచ్చే వివిధ సంస్థల ఇష్టప్రకారంగా కాదు. నో కాస్ట్ ఈఎంఐ అనే పథకం కేవలం వినియోగదారులను ఆకర్షించి, వాళ్లని దోచుకొనేందుకేనని’’ 17 డిసెంబర్ 2013లో విడుదల చేసిన సర్కులర్‌లో తెలిపింది. ఇక, ఆర్బీఐ సర్కులర్‌లో తెలిపినట్లు జీరో పర్సెంట్ స్కీమ్ అనేది లేదు.

ఇది కేవలం ఒక మార్కెటింగ్ మాయాజాలం మాత్రమే. రుణంపై వడ్డీని ఏదో ఒక రూపంలో కస్టమర్ల నుంచి వసూలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి. వీటిలో ఒక దానిని తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్‌లు ఉపయోగిస్తుంటాయి. ఫుల్ పేమెంట్ చేస్తే మీకు వచ్చే డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ మొత్తాన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలకు ఇస్తాయి. ఇందుకోసం అవి కన్జూమర్ డ్యూరబుల్ లోన్ సంబంధిత ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. మరో పద్దతి ఏంటంటే వడ్డీ మొత్తాన్ని కూడా ప్రోడక్ట్ ధరలోనే కలిపేయడం. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్‌లు తరచుగా ఈ విధానాన్ని అవలంబిస్తాయి.

ఇవి వడ్డీ మొత్తానికి సమానమైన డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాయి. మీరు ఓ ఫోన్ కొందామని అనుకుంటారు. దాని ధర రూ.15,000. మూడు నెలల ఈఎంఐ ప్లాన్‌లో దానిపై 15% వడ్డీ వసూలు చేస్తారు. అలా దానిపై రూ.2,250 వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు ఫోన్‌కి ఎంత వెల చెల్లిస్తారో దానిని రెండు భాగాలుగా చేస్తారు. ఒక భాగం రీటెయిలర్‌కి మరో భాగం వడ్డీ రూపంలో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థకు వెళ్తుంది. మీరు మొత్తం నగదు చెల్లించి ఫోన్ కొంటే మీకు రూ.12,750 మాత్రమే చెల్లించాలి.

కానీ ఇలా మీరు మూడు నెలలు ఈఎంఐపై ఫోన్ కొంటే రూ.2,250 డిస్కౌంట్ తీసేసిన తర్వాత వడ్డీ మొత్తం కలిపి చూస్తే మీరు ప్రతి నెలా రూ.5,000 చెల్లిస్తున్నట్టు. ఒక ఫోన్ ధర రూ.15,000. రీటెయిలర్ మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐతో రూ. 17,250కి ఫోన్ అమ్ముతుంటే వడ్డీ కింద రూ.2,250 వసూలు చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల మీరు ఈఎంఐ ప్లాన్ కింద మూడు నెలల పాటు నెలకి రూ.5,750 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. నిజానికి ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది పెద్ద భ్రమ. ఎందుకంటే వడ్డీ మొత్తం ఈఎంఐ నుంచే వసూలు చేస్తారు. కానీ చాలాసార్లు మనం దీనిని గుర్తించలేం.

మీరు ఏదైనా వస్తువుని కొనేటపుడు నో కాస్ట్ ఈఎంఐకి సంబంధించిన అన్ని నియమాలు, షరతులను జాగ్రత్తగా చదవండి. లేకపోతే మీ జేబు గుల్ల కావడం ఖాయం.

1 COMMENT

  1. I simply want to tell you that I am all new to blogs and absolutely enjoyed this web blog. Very likely I’m likely to bookmark your website . You certainly have fabulous articles and reviews. With thanks for sharing your blog.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here