విజయవాడ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): వ్యవసాయ కూలీలు అడిగిన వెంటనే పనులు కల్పించడం ద్వారా ఉపాధి చూపించడానికి అధికారులు సన్నద్ధులయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 160 రకాల పనుల ద్వారా శ్రామికులు ఉపాధి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కృష్ణా జిల్లాలో 970 పంచాయతీల్లో ఇప్పటి వరకు 819 పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి పనులు గుర్తించారు.

ఇదిలావుండగా, పదేళ్లుగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేసినట్లు కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన ఉపాధి ఉద్యోగుల ఐకాస జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్‌, ఏపీవో వెంకటేశ్వరరావు, టీఏ సురేష్‌ తెలిపారు.

మైలవరం మండలం చంద్రాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రిని కలిశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఈజీఎస్‌ ఉద్యోగులతో కలిసి మంత్రికి తమ సమస్యలు వివరించినట్లు చెప్పారు. జనవరి 2 నుంచి ఉపాధి హామీ పథకం ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని మంత్రి ఉమా దృష్టికి తీసుకెళ్లినట్లు సదరు ఉద్యోగులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here