మెల్‌బోర్న్, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ర్పిత్ బూమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్ జట్టులో చెల‌రేగి ఆడుతున్న బూమ్రా తాజాగా ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టులో 39 ఏళ్ల క్రితం నాటి రికార్డును తిరగరాశాడు. అప్పట్లో భార‌త బౌల‌ర్ సృష్టించిన ఈ రికార్డును తాజాగా బూమ్రా బ్రేక్ చేశాడు. మూడో టెస్టు మూడో రోజు ఆట‌లో ఈ ఘ‌న‌త అందుకున్నాడు బూమ్రా.

అరంగేట్రం చేసిన క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అత‌డు రికార్డుల‌కెక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు దిలీప్ జోషీ పేరిట ఉంది. 1979లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాదిలోనే జోషి 40 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు 9 టెస్టులాడిన బుమ్రా 17 ఇన్నింగ్స్‌ల్లో 45 వికెట్లు తీశాడు. అందులో మూడుసార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు.

తాజాగా బుమ్రా ఆ రికార్డును అధిగ‌మించాడు. అలాగే జాబితాలో 1988లో నరేంద్ర హీర్వాణీ 36 వికెట్లు, 1996లో వెంకటేశ్ ప్రసాద్ 37 వికెట్లు పడ‌గొట్టి చ‌రిత్ర సృష్టించారు. మరోవైపు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన టీమ్‌ ఇండియా ప్లేయర్‌గా కోహ్లీ (1138) రికార్డును సాధించాడు.

2002లో రాహుల్ ద్రవిడ్ (1137) నెలకొల్పిన ఈ రికార్డును 16 ఏళ్ల తర్వాత విరాట్ బద్దలుకొట్టడం విశేషం. 1971లో సునీల్ గవాస్కర్ 918 పరుగులు చేయగా, 1983లో మొహిందర్ అమర్‌నాథ్ 1065 పరుగులతో దానిని అధిగమించాడు. ఆ తర్వాత ద్రవిడ్ ఈ రెండింటిని బద్దలుకొట్టాడు. మరోవైపు, విరాట్ తన టెస్ట్ కెరీర్‌లో ఆసీస్ జట్టుపైనే అత్యధిక పరుగులు (1573) చేయడం విశేషం. ఇంగ్లండ్ (1570), శ్రీలంక (1005) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here