న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): జమ్మూ, క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి శుక్రవారం లోక్‌సభలో ఆమెదం లభించింది. ఈ అంశం గురించి లోక్‌స‌భ‌లో చ‌ర్చించిన అనంతరం సదరు తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు ఆమోదించారు. క‌శ్మీర్‌లో ప్ర‌మాద‌క‌ర వేర్పాటువాద ఉద్యమం సాగుతోంద‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఆ కార‌ణంగానే ఆ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించామ‌న్నారు. పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా మంత్రి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. క‌శ్మీర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని తామెప్పుడూ చెప్ప‌లేద‌ని మంత్రి తెలిపారు.

ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. కిచెన్‌లో కూర్చుని నిర్ణ‌యాలు తీసుకోలేమ‌ని ఆయ‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ర్వాత ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని మంత్రి తెలిపారు. క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌నకు సంబంధించిన చ‌ట్ట‌బ‌ద్ధ తీర్మానాన్ని శుక్రవారం లోక్‌స‌భ ఆమోదించింది. రాజ్యాంగంలోని 356 ఆర్టిక‌ల్ ప్ర‌కారం జ‌మ్మూక‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తూ డిసెంబ‌ర్ 19న రాష్ట్ర‌ప‌తి జారీ చేసిన ఆదేశానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే తీర్మానాన్ని లోక్‌స‌భ ఆమోదించింది. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా లోక్‌సభలో మాట్లాడారు. చ‌ర్చ‌లు, సంప్ర‌దింపులే ప్ర‌జాస్వామ్యానికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్‌కు మెజారిటీ లేదు కాబ‌ట్టే, అక్క‌డ రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించామ‌ని రాజ్‌నాథ్ అన్నారు. కాగా, ఈ వ్యాఖ్య‌ల‌ను కేంద్ర మాజీ మంత్రి ఫారూక్ అబ్దుల్లా వ్య‌తిరేకించారు. క‌శ్మీర్‌పై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ పూర్తి నివేదిక ఇచ్చార‌ని, ఎవ‌రికీ మెజారిటీ లేద‌ని ఆయ‌న చెప్పార‌న్నారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎవ‌రూ ముందుకు రాలేదు క‌నుక‌నే గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను రాష్ట్ర‌ప‌తికి చేర‌వేశార‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం లేద‌ని, కూట‌మిని నిలిపేందుకు తెగ ప్ర‌యత్నాలు చేశామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. క‌శ్మీర్ స‌మ‌స్య ఎన్నో త‌రాలుగా ఉంద‌ని, వాళ్లు బాద‌ప‌డుతుంటే అది మ‌న‌ల్ని కూడా ఇబ్బందిపెడుతోంద‌న్నారు. రెండుసార్లు అఖిల‌ప‌క్ష నేత‌ల‌తో కలిసి క‌శ్మీర్‌కు వెళ్లాన‌ని, స‌మ‌స్య ప‌రిష్కారానికి ఎవ‌రైనా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌వ‌చ్చు అని కోరిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. అయితే మంత్రి మాట్లాడుతున్న స‌మ‌యంలో క‌శ్మీర్‌లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాలు చేస్తూ హోరెత్తించాయి. క‌శ్మీర్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా కూడా ఈ అంశంపై స్పందించారు.

క‌శ్మీర్‌లో ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఉగ్ర‌వాదం ఉంద‌న్న విష‌యాన్ని కాద‌న‌డం లేద‌న్నారు. కానీ కేవ‌లం మిలిట‌రీతో ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌లేమ‌న్నారు. క‌శ్మీర్ వేర్పాటువాదులు హురియ‌త్ స‌భ్యుల‌తో హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడ‌లేద‌ని అబ్దుల్లా అన్నారు. సాధార‌ణ పౌరుల కాల్చివేత‌ను ఆపేయాల‌న్నారు. క‌శ్మీర్ అంత‌టా ఇంకా విద్యుత్తు స‌ర‌ఫ‌రా లేద‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here