సంక్రాంతి పండగ సెంటిమెంట్ తెలుగు సినీ పరిశ్రమకు కాస్త ఎక్కువనే చెప్పాలి. విషయం ఉన్న చిత్రాలు పందెంకోళ్లలా ఎగిరిగంతేయడం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇంతకు ముందు సంక్రాంతికి సీరియస్ సినిమాలతో పాటు ఫన్నీగా ఉండే సినిమాలు కూడా విడుదలవుతూ ఉండేవి. ఈ సినిమాలతో సంక్రాంతిని టాలీవుడ్ ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసేవారు.

ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి రావడం అప్పట్లో షరా మామూలే అయింది. అయితే, గత కొంతకాలంగా వెంకటేష్ సినిమాలు అంతగా పండుగ రేసులో రావడం లేదు. కానీ, వచ్చే సంక్రాంతికి మాత్రం వరుణ్ తేజ్‌తో కలిసి వెంకటేష్ ‘సంక్రాంతి అల్లుళ్ళు’గా రాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమా ఇది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని రెండు సింగిల్స్‌ను ఇప్పటికే రిలీజ్ చేశారు.

ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఒక విధంగా ఇదే కార్యక్రమాన్ని ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ వేడుకగా కూడా యూనిట్ భావిస్తోంది. చిత్ర విజయంపై అటు వెంకటేష్, ఇటు వరుణ్‌తేజ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వెంకటేష్ ప్రిన్స్ మహేష్‌బాబుతో కలిసి ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, రామ్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించిన నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా యూనిట్ అదే స్థాయి అంచనాలు పెట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here