హైదరాబాద్: రాజకీయ నాయకులు సామాన్య ప్రజల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించడం, వారి సమస్యలపై చర్చించడం అనేది ఎన్టీఆర్‌తోనే మొదలయ్యింది. అంతకు ముందంతా నేతలంటే అల్లంత దూరాన వేదికమీద నిల్చొని చెయ్యి ఊపేసి వెళ్ళిపోయేవారు. ఎవరైనా ఆ నేతతో మాట్లాడాలంటే ఏ ప్రభుత్వ అతిథి గృహానికో, కార్యాలయానికో, నేతల ఇళ్లకో వెళ్లి పడిగాపులు కాయాల్సి వచ్చేది.

అదికూడా ఎంతో కొంత పలుకుబడి ఉన్నవారికే సాధ్యమయ్యేది. కానీ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం నేతలను నేలకు దించి ప్రజల ముందు నిలబెట్టింది. ప్రజల ఇంటిముందుకు, వాళ్ళ వీధి చివరకు, వాళ్ళ చౌరస్తాకు వచ్చి వ్యక్తిగతంగా వీలైనంతమందిని కలుసుకుని, కళ్ళలో కళ్ళుపెట్టి మాటలాడి, భుజం మీద చెయ్యివేసి నిమురుతూ ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడగటం వంటివి ఎన్టీఆరే మొదలు పెట్టారు.

అందునా నడిచే దేవుడిలా తాము భావించే వెండితెర వేలుపు ఇలా కళ్ళెదురు నిలబడి తమ కష్టాల గురించి మాట్లాడటంతో ప్రజలు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అదే ఎన్టీఆర్ సంచలన విజయాలకు కారణమయ్యింది. ఇదే రకమైన ప్రచారాలను ఆ తర్వాత నేతలందరూ ఆచరించారు. ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ ప్రజా రాజకీయాలకు ఆద్యుడిగా, ఆరాధ్యుడిగా ప్రజల హృదయాలలో నిలచిపోయారు. తిరుగులేని ప్రజానాయకుడిగా దేశానికే ఆదర్శనీయుడయ్యారు.

మరోవైపు, రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా ప్రవర్తిస్తారు. అదే నాయకులు ఎన్నికల సమయం వచ్చేసరికి కృత్రిమ ప్రేమను కురిపిస్తూ జనం మధ్యకు వస్తారు. ముద్దులు కురిపిస్తారు. అడిగిమరీ పెరుగన్నం నోట్లో పెట్టించుకుంటారు. కానీ ప్రజలకు ఎవరి నిజాయితీ ఎంతో తెలుసు. వారికే తమ గుండెల్లో స్థానమిస్తారు. అలా ప్రజల హృదయాల్లోంచి పుట్టుకొచ్చిన వాడే అసలైన నాయకుడు. అలాంటి నాయకుడు ప్రజలలో ఒకడిగా ఉంటాడు.

పేదల్లో కలిసి పోతాడు. వారి బాధలనే కాదు, నవ్వుల్నీ పంచుకుంటాడు. అవ్వా, అన్నా, బ్రదర్ అన్నా ఆ పిలుపులో సహజమైన ఆప్యాయత ఉంటుంది. అలాంటి సహజసిద్ధ నాయకులను ప్రజలకు అందించింది తెలుగుదేశమే. వారందరికీ ఆద్యుడు, మార్గదర్శకుడు ఎన్టీఆరే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here