హైదరాబాద్, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన ప్రభావం ప్రస్తుతం విచారణ దశలో ఉన్న చాలా కేసులపై పడనుందన్న వాదన వినిపిస్తోంది. ఇతర కేసుల సంగతి ఎలా ఉన్నా ముఖ్యంగా రాజకీయ కోణంలో ప్రచారం పొందిన కొన్ని కేసులపై మాత్రం విభజన ప్రభావం గట్టిగానే పడనుందని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే వ్యక్తంచేశారు.

జగన్‌కు మేలు చేయడంలో భాగంగానే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హడావుడిగా హైకోర్టును విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు మానసికంగా సిద్ధమయ్యే కనీస సమయం కూడా ఇవ్వకుండా రోజుల వ్యవధిలోనే కొత్త రాజధాని నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన న్యాయవాదులు, నిపుణులు కూడా తప్పుబడుతున్నారు.

మరోవైపు, జగన్ తరహా కేసుల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు తెలంగాణ ప్రాంత న్యాయవాదులు దీనిని ఆహ్వానిస్తుంటే, మరోవైపు ఐదు రోజుల గడువుతో వెళ్లిపోమంటే ఎలా అంటూ ఏపీ ఉద్యోగులు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. అయితే శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా కోర్టుల విభజన – జగన్‌ కేసులపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు విభజన వ్యవహారంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారన్న ఆయన కనీస సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులు షిఫ్టింగ్‌లో ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

ఐదు రోజుల్లో తరలి వెళ్లాలి అంటే ఇబ్బందులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కేసులు అన్ని కోర్టుల్లో కొలిక్కి వచ్చాయి, ఇప్పుడు కోర్టుల విభజనతో ట్రైల్స్ అన్నీ మొదటికి వస్తాయన్న అభిప్రాయమూ ఉంది. సీబీఐ న్యాయస్థానం జడ్జి కూడా బదిలీ అవుతారు కాబట్టి ట్రైల్స్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమయ్యే సూచనలు లేకపోలేదు. కేసులు కొలిక్కి వచ్చే పరిస్థితిలో కోర్టుల విభజన చేశారు అనే అభిప్రాయం కూడా ఉంది. అయితే, జగన్ కేసులు బదిలీ చేస్తారా? హైదరాబాద్‌లోనే పూర్తి చేస్తారా? అనే విషయంపై పూర్తి క్లారిటీ లేదు.

దీంతో ప్రతిపక్ష నేత కేసుల్లో పెద్ద ట్విస్ట్‌గా మారింది. ప్రస్తుతానికి వినిపిస్తున్న అభిప్రాయాలను బట్టి హైకోర్టు విభజనతో కేసులను కూడా ఆయా రాష్ట్రాల పరిధిని బట్టి విభజించాల్సి ఉంటుంది. కానీ, ట్రైల్స్ చివరి దశలో ఉన్న జగన్ తరహా కేసుల విషయంలో సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.